IPL Shreyas Iyer| ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. కానీ విజేత టీమ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం ఈ మ్యాచ్ లో పెద్ద శిక్షే పడింది. మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ అంటే బౌలింగ్ ఆలస్యం చేసినందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించారు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరింది. అయితే, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు శ్రేయస్ అయ్యర్‌తో పాటు జట్టులోని మిగిలిన ఆటగాళ్లు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే నిబంధనను ఉల్లంఘించినందుకు రూ. 30 లక్షల జరిమానా చెల్లించగా, అతని జట్టు ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.
ఇదిలా ఉండగా.. క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్) నాయకత్వంలో పంజాబ్ కింగ్స్, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి, ఐపీఎల్ 18వ సీజన్‌లో కొత్త ఛాంపియన్‌గా అవతరించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. 2014లో చివరిసారి ఫైనల్ ఆడిన పంజాబ్ కింగ్స్, ఇప్పుడు జూన్ 3, మంగళవారం నాడు నాలుగుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జోష్ ఇంగ్లిస్ (21 బంతుల్లో 38) జస్ప్రీత్ బుమ్రా ఓవర్ నుండి 20 పరుగులు రాబట్టి ఛేజింగ్‌కు ఊపు తెచ్చాడు. నెహల్ వాధేరా (29 బంతుల్లో 48) తో కలిసి శ్రేయస్ అయ్యర్ 7.5 ఓవర్లలో 84 పరుగుల భాగస్వామ్యంతో జట్టును లక్ష్యానికి చేరువ చేశారు. ఆ తరువాత శ్రేయస్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఇన్నింగ్స్‌లో మొత్తం ఎనిమిది సిక్సర్లు బాదాడు.
అంతకుముందు, ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 203/6 స్కోరు సాధించింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒక్కొక్కరు 44 పరుగులు చేశారు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (24 బంతుల్లో 38) రోహిత్ శర్మ (8) త్వరగా ఔటైన తర్వాత తిలక్‌తో కలిసి 51 పరుగులు జోడించాడు. తిలక్, సూర్యకుమార్ మధ్య 72 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో నమన్ ధీర్ (18 బంతుల్లో 37) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?..
పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ (4 ఓవర్లలో 1/39), వైశాక్ విజయ్‌కుమార్ (3 ఓవర్లలో 1/30), కైల్ జామిసన్ (4 ఓవర్లలో 1/30) వికెట్లు తీశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (2/43) తో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు.
ఇంతవరకూ ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్ గెలవని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి. అందుకే ఈసారి ఐపీఎల్ 2025 సీజన్‌కు ఫైనల్ మ్యాచ్ ద్వారా కొత్త ఛాంపియన్ అవతరించబోతుండడం ఖాయంగా మారింది.