Satyanarayana Raju: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా శనివారం రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కి 8.3 ఓవర్లలో 78 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని హార్దిక్ పాండ్యా విడదీశాడు.
38 పరుగులు చేసిన ఓపెనర్, గుజరాత్ కెప్టెన్ గిల్ ని హార్దిక్ పాండ్య అవుట్ చేశాడు. అనంతరం 39 పరుగులు చేసిన జోష్ బట్లర్ ని ముజీబ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ని హార్దిక్ అవుట్ చేయగా.. 63 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియ పరుగులు ఏమి చేయకుండా డకౌట్ అయ్యాడు. ఇక రూథర్ఫోర్డ్ 18 పరుగులు చేసి దీపక్ చాహార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఇక క్రీజ్ లోకి వచ్చిన రషీద్ ఖాన్ సిక్సర్ బాదిన తర్వాత.. అతడిని సత్యనారాయణ రాజు అవుట్ చేశాడు. కాగా ముంబై ఇండియన్స్ యువ బౌలర్ సత్యనారాయణ రాజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా బంతులు వేశాడు. స్లో బాల్స్ తో సత్యనారాయణ రాజు జోష్ బట్లర్ ని సైతం ఆశ్చర్యపరిచాడు. అతడు నెమ్మదిగా వేసిన బంతి బట్లర్ ని చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ బంతిని జోస్ బట్లర్ బౌండరీ దాటించాడు.
అయితే ఆశ్చర్యం ఏంటంటే.. సత్యనారాయణ రాజు బంతి ఎంత నెమ్మదిగా వేశాడంటే.. స్పీడ్ గన్ కూడా దాని వేగాన్ని కొలవలేకపోయింది. ఈ మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ తరఫున ఆరంగేట్రం చేసిన సత్యనారాయణ రాజు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నెమ్మదైన బంతులు సంధించాడు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 25 ఏళ్ల ఈ పేసర్.. 13వ ఓవర్ లో వేరియేషన్ తో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే స్పీడ్ గన్ కూడా అతడి బంతిని రికార్డ్ చేయలేకపోవడంతో ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈనెల 23న ఆదివారం రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సత్యనారాయణ రాజు ఒకే ఓవర్ బౌలింగ్ చేసి అరంగేట్రం చేశాడు. తన ఒకే ఓవర్ లో 13 పరుగులు ఇచ్చినప్పటికీ.. జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్ పై మూడు ఓవర్ల బౌలింగ్ చేసి.. మొదటి ఓవర్ లోనే 13 పరుగులు ఇచ్చాడు. డెత్ ఓవర్లలో అతడిని తిరిగి పిలిపించడంతో.. ఆ సమయంలో 19 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసి, 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఇతడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2024లో తన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. రాయలసీమ కింగ్స్ తరఫున ఏడు మ్యాచ్లలో 6.15 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్ తో ఈ ఆటగాడిని ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. 2024 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సత్యనారాయణ రాజు ఆంధ్ర తరఫున ఏడు మ్యాచ్లు ఆడాడు. 26.85 సగటుతో, 8.23 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక 2024 – 25 సీజన్లలో రంజీ ట్రోఫీలో సైతం ఏపీ తరఫున ఆడాడు. అందులో అతడు ఆరు మ్యాచ్లలో 30.8 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు.