IPL 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సీజన్ లో రాజస్థాన్, పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ల మినహా మిగతా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనైనా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆ రెండు మ్యాచ్ ల్లో భారీ స్కోర్ సాధించడంతోనే విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు ముగిసినట్టేనని క్రికెట్ పరిశీలకులు పేర్కొంటున్నారు. 8 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ లల్లో గెలవడం.. రన్ రేట్ మరీ ఘోరంగా ఉండటం.. ఇప్పటికే 2 జట్లు 12 పాయింట్లు, 4 జట్లు 10 పాయింట్లు సాధించడంతో మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలిచినా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆప్స్ చేరడం కష్టమే అంటున్నారు.
ఇక నిన్న రాత్రి ముంబై పై సన్ రైజర్స్ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ సన్ రైజర్స్ విఫలం చెందుతున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో విఫలం చెందడంతో ఓటమి తప్పడం లేదు. గత సీజన్ లో రెండు విభాగాల్లో రాణించడంతో ఫైనల్ వరకు వెళ్లి.. రన్నరప్ గా నిలిచింది SRH. ఈ ఏడాది తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో కచ్చితంగా ఫైనల్ కి వెళ్తుందని పలువురు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా మరో వైపు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లను ఓడిపోయింది. ముంబై సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ ఔట్ ను నాటౌట్ గా చెప్పడంతో కూడా ఈ ఆరోపణలు వచ్చాయి.
ప్రధానంగా నిన్న రాత్రి సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ని ఎవ్వరూ అపిల్ చేయకుండానే ఔట్ అని చెప్పడం.. కనీసం బ్యాట్ కి కూడా బంతి తగలకున్నప్పటికీ ఇషాన్ రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్లిపోవడంతో మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలకు బలం చేకూరుతుంది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మాత్రం దానికి టోర్నీ నిర్వహించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ టపా టపా కూలిపోయింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో హెన్రిచ్ క్లాసెన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభినవ్ మనోహర్ జట్టుకు వెన్నుదన్నుగా నిలిచారు. 35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయినా.. .జట్టుకు 99 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో క్లాసెన్ 71 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. క్రీజులో అభినవ్ మనోహర్ పోరాడి 43 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 20 ఓవర్లలోో 143 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే ఛేదించింది.