Sunil Gavaskar: పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి భద్రతా కారణాల దృశ్య భారత్ కి సంబంధించిన మ్యాచులు అన్నింటినీ ఐసీసీ దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమీన్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. తాజాగా ఒకే ప్రాంతంలో మ్యాచ్లు ఆడడం భారత్ కి ప్రయోజనకరంగా మారిందని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ అభిప్రాయపడ్డారు.
Also Read: Mohammad Rizwan: పాకిస్థాన్ టీంలో భూకంపం..కెప్టెన్ పదవికి రిజ్వాన్ రాజీనామా ?
అయితే ఈ టోర్నీలో ఇంగ్లాండ్ కథ ముగియడంతో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ స్టేజ్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టు ఇంటి ముఖం పట్టింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కి చేరకుండానే నిష్క్రమించింది. అయితే ఈ బాధను టీమిండియాపై అక్కసు రూపంలో వెళ్లగక్కుతున్నారు అక్కడి మాజీ క్రికెటర్లు. అయితే వారు చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. వారికి గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు.
ముందు మీరు మీ జట్టు సంగతి చూసుకోవాలని.. ఆ తరువాత ఇతర జట్ల గురించి మాట్లాడాలని ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యలకు సునీల్ గవాస్కర్ కౌంటర్ ఇస్తూ.. “మీరంతా ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. అంతేకాకుండా చాలా తెలివైన వారు. అసలు మీరు మీ జట్టు ఎందుకు సెమీస్ కి అర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకుంటే మంచిది. ఎప్పుడూ భారత జట్టుపై దృష్టి సారించే బదులు.. ఒకసారి మీ జట్టుపై ఫోకస్ చేయవచ్చు కదా. మీ ఆటగాళ్లు చాలా పేలవంగా ఆడుతున్నారు.
వారు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నారు. ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో మీ ఆటగాళ్లు ఉన్నారు. దేశం కోసం ఆడే సమయంలో ఎంతో బాధ్యతగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారత్ కి అలాంటి అవకాశం వచ్చింది, మాకు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ కి ఇండియా ఎంతో సేవ చేస్తోంది. ఆటపరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది.
Also Read: Matthew Short Injury: సెమీఫైనల్ కు ముందే ఆసీస్ కు ఎదురుదెబ్బ..మరో ప్లేయర్ దూరం !
టీవీ, మీడియా హక్కుల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. మీకు వస్తున్న శాలరీలు కూడా పరోక్షంగా భారత్ వల్లే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కామెంటేటర్లుగా మీరు తీసుకుంటున్న జీతాలు భారత్ వల్లే అన్న విషయాన్ని మర్చిపోకండి”. అంటూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చారు సునీల్ గవాస్కర్. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుండి జోస్ బట్టర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ తన చివరి మ్యాచ్ ని నేడు రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.