Jyothika: ఒకప్పుడు చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అలా పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్లే తమ కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చేది. అలా పెళ్లి చేసుకొని కెరీర్‌ను కొన్నాళ్లు పక్కన పెట్టిన హీరోయిన్స్‌లో జ్యోతిక కూడా ఒకరు. తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది జ్యోతిక. ఆ తర్వాత పూర్తిగా తమిళనాడులోనే సెటిల్ అయిపోయింది. అలా తన కెరీర్‌ను కొన్నాళ్లు బ్రేక్ పడింది. కానీ మళ్లీ నటించాలనే ఉద్దేశ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సెకండ్స్ ఇన్నింగ్స్‌లో కేవలం తమిళ చిత్రాలు మాత్రమే కాకుండా హిందీలో కూడా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అలాంటి జ్యోతిక తాజాగా తమిళ దర్శకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
తమిళ పరిశ్రమలో మాత్రమే
వయసు పెరిగితే హీరోయిన్స్‌ను క్యాస్ట్ చేయడానికి దర్శకులు కనీసం ఆలోచించరని, హీరోల వయసు పెరిగినా కూడా వారిని సూపర్ స్టార్స్ లాగానే చూస్తారంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది జ్యోతిక. ‘‘అదే సౌత్‌లో పెద్ద ప్రశ్న. నేను 28 ఏళ్లు ఉన్నప్పుడే పిల్లల్ని కన్నాను. ఆ తర్వాత వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం మొదలుపెట్టాను. నాకు గుర్తున్నంత వరకు 28 తర్వాత నేను ఏ స్టార్‌తోనూ, హీరోతోనూ యాక్ట్ చేయలేదు. కేవలం కొత్త దర్శకులతో కొత్తగా కెరీర్ ముందుకు తీసుకెళ్లడం అనేది పెద్ద ఛాలెంజ్. ఇదంతా కేవలం ఏజ్ వల్లే. అన్ని సౌత్ భాషల్లో ఇలాగే జరుగుతుందని నేను చెప్పను. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం కచ్చితంగా ఇదే జరుగుతుంది’’ అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
స్టార్ హీరోలే కావాలి
‘‘తమిళంలో కే బాలచందర్ లాంటి దర్శకులు మళ్లీ రాలేదు. అందుకే ఆరోజుల్లో ఆడవారి కోసం కథలు గానీ ఆడవారికి ప్రాముఖ్యత ఉన్న కథలు గానీ రాలేదు. స్టార్ డైరెక్టర్స్ కేవలం స్టార్ హీరోల కోసమే సినిమాలు తీసేవారు. ఇప్పటికీ కూడా ఏ స్టార్ డైరెక్టర్.. ఒక హీరోయిన్ కోసం సినిమాను తీయడం లేదు’’ అంటూ వాపోయింది జ్యోతిక. తను చేసిన వ్యాఖ్యలకు చాలామంది హీరోయిన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో జరుగుతుంది ఇదే అయినా దీనిని ఇంత ఓపెన్‌గా చెప్పడానికి చాలామంది నటీమణులు ధైర్యం చేయలేదు. కానీ అతికష్టంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, దానిని నిలబెట్టుకోవాలని అనుకుంటున్న జ్యోతిక (Jyothika) మాత్రం ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడిందని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: క్రిప్టో కరెన్సీ వార్తలపై తమన్నా రియాక్షన్.. ఏమన్నారంటే.?
ఒంటరిగా పోరాడాలి
‘‘తమిళ పరిశ్రమ ఆడవారికి అవకాశం ఇచ్చే విషయంలో వెనకబడి ఉంది. మనం తక్కువ బడ్జెట్‌కే పరిమితం అవుతాం. ప్రస్తుతం మనకు ఉన్న రెండు పెద్ద ఛాలెంజ్‌లు ఏంటంటే.. ఒకటి ఏజ్ అయితే.. మరొకటి ఆడవారి దృష్టికోణంలో ఎవరూ కథలు రాయకపోవడం. సౌత్‌లో ఒక హీరోయిన్ జర్నీ అనేది చాలా కష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా తను ఒంటరిగా పోరాడాలి’’ అని చెప్పుకొచ్చింది జ్యోతిక. తను ప్రస్తుతం ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel) అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.