
Suryakumar – Shubman Gill : టీమ్ ఇండియా తొమ్మిది మ్యాచ్ లకు తొమ్మిదింట ఘన విజయం సాధించింది. అయితే అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. వీరిలో పలువురు బ్యాటర్లు సెంచరీలు కూడా చేశారు. కోహ్లీ అయితే రెండో సెంచరీ కూడా చేసేశాడు. కానీ ఇద్దరు మాత్రం బాకీ పడ్డారు. వారెవరో కాదు శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ వెయిటింగ్ చేస్తున్నారు.
మరి సెమీస్ లో దుమ్ముదులుపుతారా ? లేదా అన్నది చూడాలి. వారిద్దరూ సెంచరీ బాకీ పడ్డారని అభిమానులు అంటున్నారు. ఓపెనర్ గా వస్తున్న శుభ్ మన్ గిల్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ 2023లో మొత్తం 270 పరుగులు చేశాడు. అయితే వైరల్ ఫీవర్ తో రెండు మ్యాచ్ లకు దూరమైన గిల్ ఏడు మ్యాచ్ లు ఆడాడు. వీటిలో 3 అర్థశతకాలున్నాయి.
అయితే శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో 92 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ లో తొలిసెంచరీ చేసేలాగే కనిపించాడు. ఆఫ్ సెంచరీతో సరిపెట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం రావడంలేదు. ఎందుకంటే ఇప్పటివరకు టాప్ ఆర్డర్ బ్రహ్మాండగా ఆడుతోంది. చివర్లో స్కోరుని పరుగెత్తించే దశలో తను త్వరగా అవుట్ అయిపోతున్నాడు.
కాకపోతే ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు 200 పరుగులైనా చేస్తుందా? అనుకునే సమయంలో సూర్యకుమార్ 49 పరుగులు చేసి ఆదుకున్నాడు. అయితే తర్వాత బౌలర్లు మ్యాచ్ ని గెలిపించారు. ఇకపోతే ఇప్పటికి రోహిత్ (503), కేఎల్ రాహుల్ (347), శ్రేయాస్ అయ్యర్ (421) పరుగులు చేయడమే కాదు, తలా ఒకొక్క సెంచరీ చేశారు. విరాట్ కోహ్లీ 594 పరుగులు చేయడమే కాదు, రెండు సెంచరీలు చేశాడు.
ప్రస్తుతం కోహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కాకపోతే సౌతాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ (591) రచిన్ రవీంద్ర (565), రోహిత్ (503) వీరందరూ తన వెనుకే ఉన్నారు. కాకపోతే అందరూ సెమీఫైనల్స్ ఆడనున్నారు. ఈ లెక్కలు ఇలా ఉండగా.. మరి శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ లు తమ బ్యాట్ కి పనిచెప్పి సెమీస్ గండం నుంచి ఇండియాని గట్టెక్కిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.