తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీపెరంబుదూర్ ఆదికేశవ పెరుమాళ్ ఆలయన్ని దర్శించుకున్నారు. తమిళనాడు.. కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబుదూర్‌లో 3000 సంవత్సరాల నాటి ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధి గాంచింది.
చంద్రబాబు నాయుడు బుధవారం కుటుంబ సమేతంగా స్వామి దర్శనం కోసం ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా కాంచీపురం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడును హిందూ ధార్మిక శాఖ వారు సన్మానించారు. శాలువా కప్పి.. పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఏనుగు నుంచి చంద్రబాబుకు ఆశీస్సులు అందించారు.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి.. ఆలయ రికార్డు పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబు నాయుడుకు రామానుజుల ఫొటోను సావనీర్‌గా బహూకరించారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమన్నారు చంద్రబాబు. తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు.