Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ కి రోజులు దగ్గరపడ్డాయి. గంభీర్ పై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కోచ్ గా గంభీర్ దారుణంగా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి. ఆ తరువాత న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. కేవలం శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్ లో మాత్రమే భారత జట్టు గెలుపొందింది.
Also Read: Mohammed Siraj – Babar Azam: బెయిల్స్ టెక్నిక్.. సిరాజ్‌ను Copy కొట్టిన పాక్ ?
ఇక ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో కూడా భారత జట్టు తీవ్రంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం (బీజీటీ) లో 2-1 తేడాతో భారత జట్టు వెనకబడి ఉంది. దీంతో డబ్ల్యూటీసి ఫైనల్ కి వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మాజీ కోచ్ లు రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ కి కూడా ఇవ్వని వెసులుబాటుని ఇప్పటివరకు గంభీర్ కి ఇచ్చింది బీసీసీఐ మేనేజ్మెంట్.
సాధారణంగా జట్టు సెలక్షన్ సమావేశాలలో ప్రధాన కోచ్ పాల్గొనరు. కానీ గంభీర్ కి మాత్రం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు విషయంలో గంభీర్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ ఇప్పుడు గంభీర్ కోచ్ గా విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటనలో విఫలం చెందడంతో గౌతమ్ గంభీర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ పై కూడా తీవ్ర ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో గంభీర్ ని కేవలం టి-20, వన్డేలకు మాత్రమే కోచ్ గా కొనసాగిస్తూ.. టెస్టులకు స్పెషలిస్ట్ కోచ్ ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. భారత జట్టు మాజీ ఆటగాడిగా, ఓపెనర్ గా గౌతమ్ గంభీర్ కి విశేషమైన అనుభవం ఉంది. అంతేకాదు 2011 వన్డే ప్రపంచ విన్నింగ్ జట్టులో గంభీర్ కూడా ఒకరు.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే కాకుండా ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి మెంటర్ గా కూడా వ్యవహరించాడు. 2024 ఐపీఎల్ ట్రోఫీని కేకేఆర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్. అయితే ఈ అనుభవమంతా టీమిండియా కు ఉపయోగపడుతుందని బిసిసిఐ తో పాటు క్రికెట్ అభిమానులు భావించారు.
Also Read: Indian Team – WTC Final: బాక్సింగ్ టెస్ట్ లో ఓటమి.. WTC Final ఛాన్స్ ఇంకా టీమిండియాకు ఉందా ?
కానీ ఆ మేరకు గంభీర్ రాణించలేకపోతున్నాడు. దూకుడుకు మారుపేరైన గంభీర్.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల వ్యూహకర్త. అతడిని ప్రధాన కోచ్ గా నియమించగానే అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు భారత జట్టు వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.