IPL 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. గాయపడ్డ కొంతమంది ఆటగాళ్లు చాలాకాలం ఆటకి దూరంగా ఉండబోతున్నారు. అంటే ఈ గాయపడ్డ ఆటగాళ్లు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనక పోవడమే కాక.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ కి కూడా దూరం కానున్నారు. ఇలా గాయాల కారణంగా ఇటు ఛాంపియన్స్ ట్రోఫీ, అటు ఐపీఎల్ 2025 సీజన్ కి దూరం కాబోయే ఆటగాళ్ల వివరాలను చూస్తే..
Also Read: Rajal Arora: టీమిండియాలో ఉన్న ఈ లేడీ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే !
జాకబ్ బెథెల్ : ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ ఆటగాడు ఐపీఎల్ కి దూరం కావచ్చు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న జాకబ్.. ఒకవేళ ఈ ఐపీఎల్ సీజన్ కి దూరమైతే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి పెద్ద ఎదురు దెబ్బ. 21 ఏళ్ల ఈ యంగ్ బ్యాటర్ గత కొద్దిరోజులుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతూ.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ కి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జస్ప్రీత్ బుమ్రా : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్ట్ లో వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించిన బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ కి సైతం దూరంగా ఉన్నాడు. ఇతడి గాయం తీవ్రతపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు ఇతడి పేరుని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా చేర్చారు. ఒకవేళ బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రమే కాకుండా.. ఐపీఎల్ 2025 సీజన్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బుమ్రా ఐపీఎల్ కి దూరమైతే ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ విభాగం కష్టాల్లో పడ్డట్టే.
లాకీ ఫెర్గూసన్ : న్యూజిలాండ్ కి చెందిన ఈ స్పీడ్ బౌలర్ దుబాయిలోని ఐఎల్ టి-20 లో గాయపడినట్లు న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ ధ్రువీకరించారు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ఆటగాడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తో పాటు.. ఐపీఎల్ 2025 సీజన్ కి కూడా దూరం కానున్నట్లు సమాచారం. ఇతడిని పంజాబ్ కింగ్స్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఇతడు ఐపీఎల్ కి దూరం కాకూడదని కోరుకుంటుంది పంజాబ్ కింగ్స్.
అన్రిచ్ నోర్ట్జే : ఈ సౌతాఫ్రికా ఆటగాడు గత మూడేళ్లుగా గాయాలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న ఈ ఆటగాడు ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అయితే ఇతడు ఐపీఎల్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతడిని కోల్కతా నైట్ రైడర్స్ 6.50 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: Ajinkya Rahane: రహానే భారీ సెంచరీ.. టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఖాయం ?
జోష్ హెజిల్ వుడ్ : ఈ ఆస్ట్రేలియా ఆటగాడు కూడా తరచూ గాయాలతో బాధపడుతున్నాడు. తాజాగా మరో గాయం కారణంగా ఇతడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా {సీఏ} వెల్లడించింది. గాయం తీవ్రత వల్ల ఇతడు ఐపీఎల్ కి కూడా దూరం కాబోతున్నట్లు సమాచారం. ఈ పేస్ బౌలర్ ని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 12.50 కోట్లకు కొనుగోలు చేసింది.