Vinod Kambli: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం రోజు కుటుంబ సభ్యులు ఆయనని థానే లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనని శనివారం రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సోమవారం రోజు షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. వినోద్ కాంబ్లీ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించారు వైద్యులు.
Also Read: Ayodhya Cricket Stadium: అయోధ్యలో సిద్ధమైన అంతర్జాతీయ స్టేడియం..కేపాసిటీ ఎంతంటే ?
దీంతో ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం రోజుతో పోలిస్తే ప్రస్తుతం వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకి చికిత్స అందిస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది మాట్లాడుతూ.. ” కాంబ్లీకి మొదట్లో మూత్రనాళాల ఇన్ఫెక్షన్, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉండేవి. శనివారం రాత్రి బీవండీ పట్టణంలోని కల్హేర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్య బృందం వరుస పరీక్షల తర్వాత మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించింది” అని తెలిపారు వివేక్.
ఇక మంగళవారం రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త మెరుగుపడింది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందంటూ ప్రచారం చేశారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కాంబ్లీ స్పందించారు. తాను బ్రతికే ఉన్నానని.. వైద్యుల కృషి వల్ల తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. హాస్పిటల్ బెడ్ పై తన వైద్య బృందంతో కలిసి కాంబ్లీ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఓవైపు వైద్యులు అతడికి బెడ్ పై వైద్యం అందిస్తుంటే.. మరోవైపు బెడ్ పై పాట పాడారు ఈ స్టార్ క్రికెటర్.
వి ఆర్ ది ఛాంపియన్స్ అంటూ ఆసుపత్రిలో ఆయన పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతటి క్రిటికల్ కండిషన్ లో కూడా పాట పాడడంతో కాంబ్లీ ఆత్మస్థైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వినోద్ కాంబ్లీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆసుపత్రి ఖర్చులు చెల్లించేందుకు అతడి సహచర క్రికెటర్లు ముందుకు వస్తున్నారని అతడి స్నేహితుడు మార్కస్ కౌటో తెలిపారు.
Also Read: Ben Stokes Injury: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్
మరోవైపు వైద్యులు కూడా క్రికెటర్ గా రాణించిన వినోద్ పట్ల తమకు అభిమానం ఉన్నందున ఆయన కోలుకునేందుకు అవసరమైన చికిత్స తామే అందిస్తామని, అతను తన కెరీర్ లోని మధుర జ్ఞాపకాల గురించి మాతో పంచుకుంటున్నారని తెలిపారు. ఇటీవల కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిని గమనించిన భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతనికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.