Virat Kohli: ఐపీఎల్ 2025 లో భాగంగా 28వ మ్యాచ్ ఆదివారం రోజు జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు – రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ ని 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సిబి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
అనంతరం బెంగుళూరు 18 ఓవర్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ తన టి-20 కెరియర్ లో 100 వ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కోహ్లీ 40 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. ఆరోగ్యపరంగా కాస్త అసౌకర్యానికి లోనైనట్లు కనిపించాడు. ఛాతిలో నొప్పి వచ్చినట్లుగా అనిపించడంతో చేత్తో గుండె పట్టుకొని కనిపించాడు విరాట్ కోహ్లీ.
ఈ దృశ్యం చూసిన కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా వెంటనే విరాట్ కోహ్లీ సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లి తన గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయమని అడిగాడు. దీంతో సంజు తన చేతికి ఉన్న గ్లౌజ్ తీసేసి కోహ్లీ గుండె మీద చేయి వేసి విరాట్ కోహ్లీ హార్ట్ బీట్ ను చెక్ చేశాడు. ఆ సమయంలో హార్ట్ బీట్ నార్మల్ గానే ఉందని సంజు శాంసన్ చెప్పడంతో విరాట్ కోహ్లీ కుదుటపడ్డాడు. భగభగా మండే ఎండలో, జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో 42 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
రెండవ ఇన్నింగ్స్ లోని 15 ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ” విపరీతమైన ఎండ వేడికి కోహ్లీ డిహైడ్రేషన్ వల్ల ఇలా అయి ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే ఆర్సిబి టీమ్.. టైమ్ అవుట్ తీసుకొని కోహ్లీకి కాస్త విరామం ఇచ్చింది. ఇక వెంటనే టీం డాక్టర్లు వచ్చి కోహ్లీని చెక్ చేశారు. డ్రింక్స్ ఇచ్చి రీ హైడ్రేట్ చేశారు. దీంతో అదృష్టవశాత్తు విరాట్ కోహ్లీకి పెద్దగా ఏం కాలేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం విరాట్ కోహ్లీ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. 54 పరుగులు చేసిన తర్వాత ఇలా ఇబ్బంది పడినట్లు కనిపించిన కోహ్లీ.. ఆ తర్వాత 62 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 74 నిమిషాల పాటు మైదానంలో ఉన్న కోహ్లీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇలా ఎంతో కష్టమైన వాతావరణం లో కూడా కోహ్లీ ఆడిన ఆట తీరును అందరూ మెచ్చుకుంటున్నారు.
గుండె పట్టుకున్న కోహ్లీ.. అసలేమైంది..?
నిన్న RRతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక్కసారిగా గుండె పట్టుకున్న కింగ్ కోహ్లీ
కోహ్లీ ఛాతిపై చేయి పెట్టి హార్ట్ బీట్ చెక్ చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్
ఎప్పుడూ ఫిట్ గా ఉండే కోహ్లీకి ఏమైందోనని ఫ్యాన్స్ ఆందోళన pic.twitter.com/V0UaiV83es
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025