Virender Sehwag iPod Story: టీమిండియా దిగ్గజ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాటలు పాడుతూ లేదా వింటూ బ్యాటింగ్ ఇరదీస్తూ ఉంటాడు. సౌతాఫ్రికాపై 300 పరుగులు చేసినప్పుడు కూడా ఇషాంత్ శర్మ ద్వారా ఐపాడ్ తెప్పించుకుని, పాటలు వింటూ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చేశాడు. ఇదే మ్యాచ్ లో 300లకు పైగా వీరేంద్ర సెహ్వాగ్ పరుగులు బాదడం గమనార్హం. అయితే, మ్యాచ్ మధ్యలో ఇషాంత్ శర్మ ద్వారా ఐపాడ్ తెప్పించుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే, ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్, ఫిదా అయిపోతున్నారు. ఇదెక్కడి మాస్ రా మామ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్ పై కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య 2008లో చెన్నై వేదికగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ బాదాడు. గతంలో పాకిస్తాన్ పై ట్రిపుల్ సెంచరీ చేసిన వీరేంద్రుడు, సౌతాఫ్రికాపై కూడా దంచికొట్టాడు. అయితే, 300ల మార్క్ దాటిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ కు కాస్త బోర్ కొట్టిందట. ఈ క్రమంలోనే డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఇషాంత్ శర్మను పిలిచాడు. ఆ సమయంలో టీమిండియా 12వ ఆటగాడికి ఇషాంత్ శర్మ ఉన్నాడు. సెహ్వాగ్ కేక వేయగానే కూల్ డ్రింక్స్ తో పాటు ఐ పాడ్ తీసుకొచ్చాడు ఇషాంత్. ఈ తరుణంలోనే హిందీ పాటలు పెట్టుకుని, మళ్లీ బ్యాటింగ్ చేశాడు సెహ్వాగ్. పాటలు వింటూ బ్యాటింగ్ చేస్తే, తనకు మంచి మూడ్ వస్తుందని మ్యాచ్ తర్వాత వెల్లడించారు. ఒత్తిడి పోయి, ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే శక్తి..సామర్థ్యాలు తనకు వస్తాయని చెప్పుకొచ్చారు.
కాగా ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ 304 బంతుల్లో 319 పరుగులు సాధించాడు. ఇందులో 42 బౌండరీలు ఉండగా, 5 సిక్సర్లు ఉన్నాయి. 104.93 స్టైక్ రేట్ ఈ పరుగులు సాధించాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, తొలి ఇన్నింగ్స్ లో 540 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 331 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అటు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 627 పరుగులు సాధించింది.
వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్ లో రెండు సార్లు 300ల మార్క్ దాటాడు. 2004లో పాకిస్తాన్ పై ముల్తాన్ వేదికగా 309 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాపై 2008లో 319 పరుగులు సాధించాడు. 2009లో ముంబై వేదికగా శ్రీలంకతో టీమిండియా టెస్ట్ లో తలపడింది. ఇందులో 293 పరుగుల వద్ద సెహ్వాగ్ ఔటై, మరో త్రిపుల్ సెంచరీని తృటిలో తప్పించుకున్నాడు.