Vizag Girl : సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొంత మంది ధనికులు పేదలుగా మారుతారు. మరికొందరూ పేదలు కొద్ది రోజుల వ్యవధిలోనే ధనికులుగా మారుతారు. అయితే తాజాగా ఓ పల్లెటూరి బాలిక ఏకంగా వరల్డ్ కప్ క్రికెట్ కి ఎంపికవ్వడంతో ఆ పల్లెటూరి వారంతా ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. కాకులు కూడా దూరని కారడవి లాంటి ఊర్లో ఆ బాలిక పుట్టింది. ఆ ఊరిలో కేవలం 70 ఇళ్లు మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ అంటే ఏంటో తెలియని ఊరి నుంచి.. ఏకంగా క్రికెట్ లో ప్రపంచ కప్ కి సెలెక్ట్ కావడం విశేషం.
పుట్టికతోనే పాక్షికంగా అంధత్వం ఉన్న చిన్నారి ఆ చిన్నారి టీవీ, ఫోన్ లో అప్పుడప్పుడు వచ్చే క్రికెట్ ను అస్పష్టంగా చూసేది. అయితే అలా ఆడితే ఎంత బాగుంటుందో అని మనస్సులో అనుకునేది. చూడటమే సాధ్యం కానీ తనకు ఆడటం ఎలా సాధ్యం అంటూ లోలోపల బాద పడేది. వీలు కుదిరినప్పుడల్లా రాళ్లు, రప్పలను బాల్ గా, కర్ర ముక్కలను బ్యాట్ గా మార్చుకొని వాటితో క్రికెట్ ఆడుతూ తృప్తి పడుతూ ఉండేది. ఇప్పుడు ఆమె కల మామూలుగా సాకారం కాలేదు. ఏకంగా టీ 20 వరల్డ్ కప్ ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఆ అమ్మాయి పేరే పాంగి కరుణ కుమారి. ఆమె ఊరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్ల మామిడి.
కరుణ కుమారి తల్లిదండ్రులు రాంబాబు, సంధ్య కూలినాలి చేసుకొని తమ నలుగురు బిడ్డలను పోషించుకుంటున్నారు. చాలీ చాలని సంపాదనతో పిల్లల పోషణ కష్టతరంగా మారింది. వీటికి తోడు వీళ్లు మట్టిగోడలపై రేకులు వేసుకున్న షెడ్డులోనే ఏళ్ల తరబడి ఉంటున్నారు. వీరి రెండో సంతానం కరుణ కరుణ కుమారి. పేదరికంతో కొడుకు శివ 10వ తరగతి చదివి ఆపేశాడు. 7వ తరగతి వరకు సమీపంలోని పాఠశాలలో చదువుకున్న కరుణకుమారి ఓ టీచర్ సాయంతో విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల స్కూల్ లో చేరింది. మిత భాషి అయిన కరుణ ఎవ్వరితో కూడా మాట్లాడేది కాదు. కానీ ఆటలపై చాలా ఆసక్తి కనబరిచేది. క్రికెట్ తో పాటు జావలిన్ థ్రో, షాట్ పుట్, డిస్కస్ త్రో వంటి క్రీడల్లో రాణించేది. క్రికెట్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని గురించిన పీఈటీ రవికుమార్ ఆమెను ప్రోత్సహించారు. ఆయన రిటైర్డ్ అయిన తరువాత అతని స్థానంలో వచ్చిన పీఈటీ సత్యవతి అంధుల క్రికెట్ లో మెలుకువలు నేర్పారు.
Also Read : Asia Cup 2025 : సూపర్ 4 మ్యాచ్ ల షెడ్యూల్ వచ్చేసింది..పాకిస్థాన్ తో టీమిండియా ఫైట్.. ఎప్పుడంటే
దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించింది కరుణ. 2023 డిసెంబర్ లో జాతీయ అంధ మహిళల క్రికెట్ జట్టు కి ఎంపిక అయింది. 2024లో హుబ్లీలో జరిగిన మ్యాచ్ లో తొలిసారిగా పాల్గొని సత్తా చాటింది. 2025 జనవరిలో కొచ్చిలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో రాణించింది. ఈ ఏడాది మార్చిలో కొచ్చిలో జరిగిన పెట్రోనేట్ ఇన్ఫినిటీ సిరీస్ లో కర్నాటకను ఓడించి ఏపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది కరుణ. దీంతో ప్రపంచ కప్ జట్టు ఎంపిక ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 5 వరకు బెంగళూరులో నిర్వహించారు. ఈ సెలక్షన్స్ లో కరుణ ఏకంగా 70 బంతుల్లో 114 పరుగులు చేసింది. 60 బంతుల్లోనే సెంచరీ సాధించడంతో కరుణ ప్రతిభకు అంతా నివ్వెరపోయారు. వెంటనే సెలెక్టర్లు ఆమె టీ-20 అంధ మహిళల ప్రపంచ కప్ ఆడే జట్టుకు ఎంపిక చేశారు. తల్లిదండ్రులు పేదరికం కావడంతో తమ కూతురు అంధ మహిళల క్రికెట్ జట్టుకి ఎంపిక అయిందని చెప్పినా నమ్మలేదు. పేపర్ లో వచ్చిందని.. పేపర్ చూపిస్తే కానీ నమ్మడం గమనార్హం.