Shoaib Akhtar On Ball Tampering: పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team) అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నిత్యం ఏదో ఒక అంశంలో ఆ జట్టు వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పుడు వివాదంగా మారుతాయి. ఆ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు కూడా తల తిక్క పనులు చేస్తూ, మీడియాకు మంచి స్టఫ్ గా మారుతూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాల్ టాంపరింగ్ (Ball Tampering) కు పాల్పడుతుందని షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కూడా తాము చేసామని నిజాన్ని ఒప్పుకున్నారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ తాము చేసామని, అలా చాలా మ్యాచుల్లో విజయం సాధించామని షాకింగ్ నిజాలను బయటపెట్టారు షోయబ్ అక్తర్. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ ప్లేయర్లు నిత్యం బాల్ టాంపరింగ్ వ్యవహారంలో అడ్డంగా దొరుకుతారన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. బాల్ టాంపరింగ్ వ్యవహారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పాకిస్తాన్ ప్లేయర్లు తయారయ్యారని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారం పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము కూడా గతంలో ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారంలో భాగస్వామ్యులమే అని తెలిపారు. తాను ఈ బాల్ టాంపరింగ్ చేయలేదు కానీ… తన ఆధ్వర్యంలో చాలా సంఘటనలు జరిగినట్లు గుర్తు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు దాదాపు ప్రతి మ్యాచ్ లో కూడా బాల్ టాంపరింగ్ చేసేదని ప్రపంచం మొత్తానికి తెలుసని బాంబు పెంచారు.
బాల్ టాంపరింగ్ చేసింది ఇది వాస్తవం.. దీన్ని ఎవరూ మార్చలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు షోయబ్ అక్తర్. తాను ఏళ్ల తరబడి పాకిస్తాన్ జట్టులో ఉన్నాను… ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ చేయడానికి నా కల్లారా చూసానని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. స్వయంగా ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రిది కూడా కెమెరా ముందే ఈ విషయాన్ని అంగీకరించారని బాంబు పేల్చారు. తాము ఓడిపోయినప్పుడల్లా పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారని… చాలాసార్లు తమ ఇండ్లపై రాళ్లు విసిరేవారని వెల్లడించారు. తమకు వేరే మార్గం ఉండేది కాదంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ అభిమానులు కొడతారన్న భయంతో.. బాల్ టాంపరింగ్ చేసే వాళ్ళమని గుర్తు చేశారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.