Rana Naved On Virender Sehwag: పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( IND VS PAK) మధ్య మ్యాచ్ అంటే ఆ రోజున అభిమానులకు పండగే. ఎన్ని పనులు ఉన్నా జనాలందరూ టీవీ ముందు కూర్చుండి పోతారు. కొంతమంది అయితే పనులు వదులుకొని.. టీవీలకు అతుక్కుపోతారు. ఇక పాకిస్తాన్ పైన వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధిస్తే ఆ రోజు పండగే. అప్పట్లో పాకిస్తాన్ పై వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగి ఆడేవాడు. చుక్కలు చూపించేవాడు.
అయితే అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ పరువు తీసేలా పాకిస్తాన్ మాజీ బౌలర్ రానా నవేద్-ఉల్-హసన్ ( Naved-ul-Hasan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ ను సులభంగా తాను ఔట్ చేస్తానని ప్రకటించారు. అతన్ని అవుట్ చేయడానికి కేవలం రెండు బంతులు సరిపోతాయని బాంబు పేల్చారు. వీరేంద్ర సెహ్వాగ్ కంటే అప్పటి టీమిండియా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ చాలా భయంకరమైన ఆటగాడని కొనియాడారు. అందుకే అతనికి ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చిందని కూడా ప్రశంసించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ పైన రానా నవేద్-ఉల్-హసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2004 సమయంలో భారత పర్యటనకు పాకిస్తాన్ వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను పాకిస్తాన్ మాజీ బౌలర్ రానా నవేద్-ఉల్-హసన్ ( Naved-ul-Hasan ) గుర్తు చేసుకున్నారు. రానా నవేద్-ఉల్-హసన్ కథనం ప్రకారం… అప్పట్లో జరిగిన వన్డే మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ 85 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. పాక్ బౌలర్లను ఇరగదీస్తున్నాడు. ఈ క్రమంలోనే రానా నవేద్-ఉల్-హసన్ వద్దకు కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వచ్చి బౌలింగ్ చేయమని బంతి ఇచ్చాడు. ఏదైనా చేసి, సెహ్వాగ్ వికెట్ తీయాలని కోరాడని చెప్పినట్లు రానా నవేద్-ఉల్-హసన్ పేర్కొన్నారు.
ఇక ఎలాగైనా వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ తీయాలన్న కసితో… తానే అతన్ని స్లెడ్జింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అసలు నీకు ఆడటం రాదు.. నువ్వు పాకిస్తాన్ లో ఉండి ఉంటే గనక అసలు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకే ఎంపిక అయ్యే వాడివి కాదు అంటూ హేళన చేస్తూ మాట్లాడాడట రానా నవేద్-ఉల్-హసన్. దానికి కోపంతో వీరేంద్ర సెహ్వాగ్ కూడా బదులిచ్చినట్లు సమాచారం. అయితే స్లెడ్జింగ్ చేసిన రానా నవేద్-ఉల్-హసన్ పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆవేశపడ్డ వీరేంద్ర సెహ్వాగ్.. తర్వాతి బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రానా నవేద్-ఉల్-హసన్ పంచుకున్నాడు. అలా రెచ్చగొట్టి, వీరేంద్ర సెహ్వాగ్ ను త్వరగానే ఔట్ చేయవచ్చని తెలిపారు. మరో మ్యాచ్ లో ఇదే రానా బౌలింగ్ లో 2 బంతులకే 21 పరుగులు సెహ్వాగ్ సాధించాడు.