India and Pakisthan : T20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయం సాధించగానే… రెండు జట్లూ మళ్లీ ఫైనల్లోనూ తలపడి రోహిత్ సేన పొట్టి కప్ గెలవాలని చాలా మంది భారత అభిమానులు కోరుకున్నారు. అది ఎలా సాధ్యం అవుతుందా? అని ఎన్నో సమీకరణలు తీశారు. మరెన్నో లెక్కలేశారు. కానీ… ఆ తర్వాత సెమీస్ బెర్తే ఎవరికి దక్కుతుందో తెలీని పరిస్థితులు తలెత్తడం, అద్భుతం జరిగేతే తప్ప పాక్ సెమీస్ చేరలేదని తేలడంతో… ఆ ఆశలు వదిలేసుకున్నారు. కానీ… ఎవరూ ఉహించని అద్భుతంలా సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవగానే… పాకిస్థాన్ రెట్టించిన ఉత్సాహంతో ఆడి బంగ్లాపై గెలిచి సెమీస్ చేరింది. దాంతో… భారత్-పాక్ మధ్యే ఫైనల్ మ్యాచ్ జరిగి… టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు… భారత అభిమానులు.
సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో, పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో తలపడబోతున్నాయి. అయితే… పటిష్టమైన ఆ రెండు జట్లను ఓడించడం భారత్, పాక్ కు అంత సులభమేమీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను దెబ్బతీయడం టీమిండియాకు సవాలే. ఓపెనర్ నుంచి టెయిలెండర్ దాకా ఇంగ్లండ్ టీమ్ లో అంతా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే కావడంతో… ఆ జట్టును ఓడించాలంటే భారత ఆటగాళ్లు సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. ఇక భయంకరమైన ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ను ఓడించాలంటే… పాక్ శక్తికి మించి ఆడాల్సిందే. అదే జరిగి టీమిండియా, పాకిస్థాన్ ఫైనల్లో తలపడితే చూడాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మెగా టోర్నీల్లో రెండు జట్ల మధ్యా లీగ్ మ్యాచ్ అంటేనే ఫుల్ జోష్ ఉంటుందని… ఇక ఫైనల్లో తలపడితే ఎంత హైఓల్టేజ్ ఫైట్ జరుగుతుందో చెప్పనక్కర్లేదని అంటున్నారు. 2007లో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్లో పాక్ పై భారత విజయాన్ని ఎంజాయ్ చేసి 15 ఏళ్లు గడిచిపోయాయని… మళ్లీ అలాంటి విజయానందాన్ని రుచి చూసి సంబరాలు చేసుకోవాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.