Yograj Singh: భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఈ మధ్యకాలంలో తన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనని టీమిండియాకి కోచ్ గా నియమిస్తే తిరుగులేని శక్తిగా మారుస్తానని తెలిపాడు. జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను రక్షించి, వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
Also Read: Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !
తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తరుణ్ కోహ్లీతో “ఫైండ్ ఏ వే” పాడ్ కాస్ట్ లో యోగరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “నన్ను టీమ్ ఇండియాకి కోచ్ గా నియమిస్తే.. నేను ఈ ఆటగాళ్లతోనే జట్టును మరింత పటిష్టంగా మారుస్తా. ఆటగాళ్లను తరచూ జట్టు నుండి తీసేస్తే.. వాళ్ల సామర్థ్యాన్ని ఎవరు బయటకు తెస్తారు..? కొందరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ని పక్కన పెట్టాలని అంటున్నారు. వారు ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. నా పిల్లలతో సమానమైన వారికి ఇటువంటి సమయంలో నేను మద్దతుగా ఉంటాను.
వారు కచ్చితంగా రంజీల్లో ఆడాలని కోరుతాను. రోజుకు 20 కిలోమీటర్లు పరిగెత్తాలని రోహిత్ శర్మకి చెప్తాను. ఈ ఇద్దరూ టీమ్ ఇండియాకు దొరికిన వజ్రాలు. వాళ్లని అస్సలు వదులుకోకూడదు. నేను వారికి తండ్రి లాంటి వాడిని. యువరాజ్ కి ఇతరులకు మధ్య నేను ఎప్పుడూ తేడా చూపలేదు. మహేంద్ర సింగ్ ధోనీని కూడా అలా చూడలేదు. కానీ ఎప్పటికీ తప్పును మాత్రం తప్పు అనే చెబుతాను. ఇక అర్జున్ టెండూల్కర్ నా దగ్గరికి వస్తే 6 నెలల్లోనే ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్ ని చేస్తాను.
బ్యాటింగ్ లో అతడి సామర్థ్యం ఎవరికీ తెలియదు. అతడు గోవా జట్టుకు ఎంపిక కాకముందు 10 – 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చాను. అప్పుడే అతడు గొప్ప బ్యాటర్ అని గ్రహించాను. ఆ తర్వాత రంజి ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. అతడితో బౌలింగ్ చేయించి సమయం వృధా చేస్తున్నారని అనిపిస్తోంది” అని పేర్కొన్నాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.
వరుసగా టీ-20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఈ మధ్య రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాడు. క్రికెట్ లో మరికొంత కాలం కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే వచ్చే నెలలో రోహిత్ శర్మకి 38 సంవత్సరాలు నిండుతాయి. దీంతో హిట్ మ్యాన్ టెస్ట్ కెరీర్ గురించి మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్.. రోహిత్ శర్మ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.