ఎప్పుడైతే వన్డే వరల్డ్ కప్ 2023లో ఆసిస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందో అప్పటి నుంచి ఒక డిమాండ్ పైకి లేచింది. అదేమిటంటే నాకౌట్ మ్యాచ్ ల్లో గెలవడం ఎలాగో మన క్రికెటర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అంతవరకు అటూఇటుగా ఆడిన ఆస్ట్రేలియా సరిగ్గా ఫైనల్ కి వచ్చేసరికి పక్కా ప్రొఫెషనల్స్ గా ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే మనవారిలో రావాలని అంటున్నారు.
వరల్డ్ కప్ 2023లో ఆసిస్ ని చూస్తే, ఆఫ్గనిస్తాన్ లో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విలవిల్లాడుతుంటే మ్యాక్స్ వెల్ పుణ్యమాని బయటపడింది. ఇక సెమీఫైనల్ లో సౌతాఫ్రికా స్వయంకృతాపరాథం వల్లే ఆసిస్ ఫైనల్ లో అడుగుపెట్టింది. లీగ్ మ్యాచ్ ల్లో ఒకట్రెండు తప్ప, అద్భుతంగా ఆడి గెలిచినవి లేవు. అలాంటిది ఒక్కసారి ఫైనల్ లో జూలు విదిల్చి, పక్కా ప్రొఫెషనల్స్ గా ఆడి, పిచ్ నుంచి లబ్ధి పొంది విజయం సాధించారు.
ఇప్పుడు మన టీమ్ ఇండియాకి కూడా నాకౌట్ మ్యాచ్ ల్లో గెలిచే టీమ్ ఒకటి కావాలని అంటున్నారు. అలాంటిదాన్ని ఇప్పటి నుంచే తయారుచేయాలని అంటున్నారు. ఉదాహరణకి యువరాజ్ సింగ్ ను చూపిస్తున్నారు. ఒకసారి, రెండుసార్లు కాదు మూడుసార్లు ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ ల్లో టీమ్ఇండియాని గెలిపించిన మగధీరుడిగా రికార్డులకి ఎక్కాడు. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ ల్లో నెగ్గాలంటే మరొక యువరాజ్ కావాలని అంటున్నారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలో టీమిండియా ఓడింది. అంటే ఒక్క ఆస్ట్రేలియా వల్ల భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు సహా మూడు ఐసీసీ ట్రోఫీలు దూరమయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ నాలుగుసార్లు ఆస్ట్రేలియాను ఓడించ గలిగింది. ఒకసారి సచిన్ భారత్‌ను గెలిపిస్తే.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో యువరాజ్ సింగ్ గెలిపించాడు.
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను ఓడించడంలో యువరాజ్ సింగ్ దే కీలక పాత్ర అని చెప్పాలి. 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి నాకౌట్ మ్యాచ్‌లో యువీ 84 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
2007 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో పడింది. అప్పుడు యువరాజ్ విధ్వంసం ఎవరూ మరిచిపోలేరు. 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి టీమ్ ఇండియాని ఫైనల్ కి తీసుకెళ్లాడు. అక్కడ పాకిస్తాన్ పై నెగ్గి టీమ్ ఇండియా కప్ కొట్టింది. 2011 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా యువరాజ్ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 2 వికెట్లు తీయడమే కాదు, 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ని గెలిపించాడు.
యువరాజ్ లా గెలిపించేవాడు ఒకడు కావాలి. ఇప్పుడు టీ 20 కి ఒక జట్టు, వన్డేకి ఒక జట్టు, టెస్టుకి ఒక జట్టు కాదు, నాకౌట్ లో ఆడేందుకు కూడా ఒక టీమ్ ని తయారుచేయాలని సూచిస్తున్నారు. రింకూ సింగ్ లాంటి వాళ్లని ప్రోత్సహించాలని, రేపు రెండు, మూడు మ్యాచ్ ల్లో సరిగ్గా ఆడకపోతే పక్కన పెట్టి ఆటగాళ్ల మానసిక స్థితితో ఆటలాడ వద్దని నెట్టింట సూచనలు చేస్తున్నారు.