తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం గతంలో రాజకీయ ప్రకంపనలు రేపింది. బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ TSPSC ప్రక్షాళనపై హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు TSPSC ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించిన రేవంత్.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే నియామక ప్రక్రియలో అత్యంత సమర్థవంతమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానం, ఇతర రాష్ట్రాల కమిషన్‌లను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు బృందాన్ని పంపించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో TSPSC ద్వారా చేపట్టిన నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కమిషన్ ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసింది..?, ఎన్ని నోటిఫికేషన్ల పరీక్షలు రద్దయ్యాయి..? ఎన్ని పూర్తి చేశారు..? ఫలితాలు విడుదల చేశారా? కోర్టు కేసులు ఏమున్నాయా అన్న దానిపై ఆరా తీశారు. అయితే,.. లీకేజీపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 108 మందిని అరెస్టు చేశామని.. న్యాయస్థానంలో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశామని, రెండో ఛార్జిషీట్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల కారణంగా సిట్‌లోని అధికారులంతా బదిలీ అయ్యారని సీఎంకు వివరించారు.
మరోవైపు TSPSC చైర్మన్ జనార్థన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులు ఎవరో తెలియకుండా, నిరుద్యోగులకు న్యాయం జరగకుండా రాజీనామాను అంగీకరించేది లేదని తమిళిసై తెలిపినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.