Mahabubabad News: మీ ఇంట్లో చిన్నారులు ఉన్నారా? వారు పల్లీ గింజలు తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేకుంటే పెను ప్రమాదం తప్పదు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. ఓ బాలుడు పల్లీ గింజలు తింటూ ప్రాణాలు వదిలాడు. దీనితో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తెలంగాణలో జరిగింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో గుండెల వీరన్న, కల్పన అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కాగా, అబ్బాయి పేరు అక్షయ్. అక్షయ్ వయస్సు 18 నెలలు. గురువారం సాయంత్రం పిల్లలు పాఠశాల నుండి రాగానే, సరదాగా అందరూ కలిసి పల్లీ గింజలు తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయాన అక్షయ్ చేతిలో కూడా గింజలు ఉన్నాయి. అక్షయ్ గింజలను నోటిలో వేసుకున్నాడు. ఆ తర్వాత గట్టిగా ఏడ్చడం మొదలుపెట్టాడు.
దీనితో కుటుంబసభ్యులు ఏం జరిగిందంటూ చూశారు. అంతలోనే అక్షయ్ నోటిలో పల్లీ గింజలు ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ పల్లీ గింజల రూపంలో అక్షయ్ ను మృత్యువు కబలించింది. గురువారం రాత్రి వైద్యశాలకు చేర్చగా, అక్షయ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వైద్యులు శతవిధాలా ప్రయత్నించనప్పటికీ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Also Read: weavers loan waiver: నేతన్నలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్..
18 నెలల బాలుడు మృతి చెందడంతో బాలుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క కుమారుడు మృత్యు ఒడిలోకి చేరగా, తల్లిదండ్రులు గుండెల వీరన్న, కల్పన రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. పిల్లలు గృహాలలో ఉన్న సమయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నారుల చేతిలో ఏమున్నాయన్న విషయాన్ని గమనించాలని, చిన్నారులు తెలిసీ తెలియక నోటిలో వేసుకున్న పదార్థాలు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: KTR Tweet: కేటీఆర్.. కాస్త ఆలోచించు.. నెటిజన్స్ సలహా
మొత్తం మీద నాయకపల్లిలో బాలుడు పల్లీ గింజలు గొంతులో ఇరుక్కొని మృతి చెందినట్లు తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని కుటుంబసభ్యులను ఓదార్చారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరి కాగా, ఇదొక దురదృష్ట ఘటనగా గ్రామస్థులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా చిన్నారులపై వారి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండా కాలంలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు ఎక్కువగా నీటి బావుల వద్దకు వెళుతుంటారని, తప్పనిసరిగా ఆ సమయంలో పెద్దల పర్యవేక్షణ ఉండాలని కూడా పలువురు సూచిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇంటి వద్ద ఉన్న చిన్నారులపై పెద్దల పర్యవేక్షణతో పాటు, ప్రమాదాలపై అవగాహన కల్పించేలా కథల రూపంలో వివరించాలని మేధావులు సూచిస్తున్నారు.