KTR Tweet: ఆ నేతకు తెలుగు తమ్ముళ్లు షాకిస్తున్నారు. ఒక్క ట్వీట్ తో నెటిజన్స్ నుండి విమర్శలు అందుకున్నారు ఆ నేత. మరికొంత మంది ఇంకాస్త హీట్ పెంచి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆ నేతకు సూచిస్తున్నారు. ఇంతకు ఎవరా నేత? అసలేం జరిగిందో తెలుసుకుందాం.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అవకాశం దొరికితే చాలు.. కాంగ్రెస్ పై కాలు దువ్వుతారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా కేటీఆర్ విమర్శల జోరు కనిపిస్తుంది. అయితే పలుమార్లు మిస్టేక్ పోస్ట్ తో కేటీఆర్ ట్రోలింగ్ కు గురయ్యారని చెప్పవచ్చు. ఇటీవల గత బీఆర్ఎస్ హయాంలో ఓ రైతన్న ఆవేదనను కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత తమ ప్రభుత్వ హయాంలో రైతు ఎదుర్కొన్న సమస్యకు సంబంధించిన వీడియోగా గుర్తించి ఆ పోస్ట్ తొలగించారు. అప్పటికే కాంగ్రెస్ ఎదురుదాడి చేసి, మంచిపని చేశారు కేటీఆర్ అంటూ కామెంట్స్ కురిపించింది.
తాజాగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ కు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా తెలుగు తమ్ముళ్లు విమర్శల జోరు సాగిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారని ట్వీట్ చేశారు. ఇక్కడే కేటీఆర్ చేసిన ట్వీట్ విమర్శలు అందుకుంటోంది. ఆఖరుకు అనే పదం ఎందుకు వాడారని, ఏపీ పెట్టుబడులకు పనికిరాదా? ఆ అహంకారం ఏంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.
ఇక తెలుగు తమ్ముళ్లు అయితే అధికారం కోల్పోయినా ఇంకా మార్పు రాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను కేటీఆర్ మానుకోవాలని, తెలంగాణకు పెట్టుబడులు వచ్చిన విషయం మరచిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దావోస్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించగా, సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా తెలంగాణకు అన్యాయం జరిగిందని కేటీఆర్ ఎలా అంటారని కాంగ్రెస్ అంటోంది.
ఆఖరుకు అనే పదం పట్టుకున్న తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఏపీ పెట్టుబడులకు పనికి రాకుండా పోయిందా? ఇటీవల టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కేటీఆర్ కు గుర్తు చేస్తున్నారు. ఏపీలో సకల సదుపాయాలు, అవకాశాలు పరిశ్రమలకు ఉన్నాయని, ఒకసారి కేటీఆర్ కళ్లు తెరిచి చూడాలని వారు కోరుతున్నారు. ఒక రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడి, విభేదాలను సృష్టించే ప్లాన్ వేసిన కేటీఆర్ ఇప్పటికైనా మారాలని హితవు పలుకుతున్నారు. మొత్తం మీద ఏపీ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ కాగా, నెటిజన్స్ మాత్రం మరీ అంతవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై కేటీఆర్ ఏమని స్పందిస్తారో వేచిచూడాలి.