22-A Lands: రాష్ట్రంలో ఏళ్లకు ఏళ్లుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ల దగ్గర ఆగిపోయి, సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న 22-ఎ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు, నిబంధనల చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ల్యాండ్ ఓనర్లకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
నాలా మార్పిడి లేకుండా ఉన్న పట్టా భూములకు తీపి కబురు
గతంలో నాలా అనుమతులు తీసుకోకుండానే నివాస ప్రాంతాలుగా మారిపోయిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిర్ణీత నాలా రుసుము చెల్లించడం ద్వారా, అర్హత ఉన్న భూములకు వెంటనే రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించేందుకు బాటలు పరిచింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా అధికారిక ఆదేశాలు విడుదల చేసింది.
గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు
ఈ ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వేగంగా అమలు జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును ఒక నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు త్వరితగతిన రిజిస్ట్రేషన్లు జరిగేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆచరణలో హామీలు.. ప్రజా ప్రభుత్వ లక్ష్యం
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సి (ULC) దరఖాస్తులతో పాటు, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలు, జీవో 118, జీవో 76ల ఆధారంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు ముఖ్యమైన ఉత్తర్వులను తీసుకొచ్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అధికారులు పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఈ 22-ఎ సమస్యలను శాశ్వతంగా కొలిక్కి తేవడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు.
Also Read: మద్యానికి నో.. 70 ఏళ్లుగా ఇదే రూల్.. సూర్యాపేటలోని ఈ ఆదర్శ గ్రామం గురించి తెలుసా?