CM Revanth Reddy : 400 ఎకరాలు. చాలా సింపుల్ మేటర్. కానీ, కాంప్లికేటెడ్ చేసేశారు. కొన్ని రోజులుగా ఈ ఇష్యూ చుట్టూనే తెలంగాణ రాజకీయం రగులుతోంది. మధ్యలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్లు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులు ఎంటరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. హైదరాబాద్, కంచ గచ్చిబౌలి భూముల వ్వవహారం తారాస్థాయికి చేరింది.
అసలు ఏంటి గొడవ?
ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవే అంటున్నారు HCU స్టూడెంట్స్. కాదు కాదు.. అది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ అని రికార్డులు చూపిస్తోంది సర్కారు. హెచ్‌సీయూ విద్యార్థులకు బీజేపీ సపోర్ట్ చేస్తోంది. గొడవను ఏబీవీపీ లీడ్ చేస్తోంది. బీఆర్ఎస్ పరోక్షంగా ఎగదోస్తోంది.
ఎవరీ బిల్లీరావు? HCUకి ఏం సంబంధం?
ఐటీ కంపెనీల ఏర్పాటు, పలు అంతర్జాతీయ ప్రాజెక్టుల కోసం గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలను TGIICకి ఇటీవలే కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అంతే. పచ్చని చెట్లు కొట్టేయవద్దని, అందులో ఉన్న చెరువులను నాశనం చేయొద్దని.. ఆ భూములు మా యూనివర్సిటీకి చెందినవని అంటూ HCU విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సర్కారు ఈ వాదనను గట్టిగా ఖండిస్తోంది. 2004లో ఆ 400 ఎకరాలను అప్పటి సర్కారు.. IMG అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి కేటాయించింది. బిల్లీరావు అనే వ్యక్తికి ఆ విలువైన భూములు దారాదత్తం చేశారని అంటోంది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. ఆ 400 ఎకరాలపై కోర్టులో ఛాలెంజ్ చేసి.. బిల్లీరావు అనే ప్రైవేట్ వ్యక్తి నుంచి ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు దక్కేలా చేశారు. సో, ఇప్పుడు ఆ భూమి 100శాతం సర్కారుదే. ఆ స్థలాల్లో ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, ఆ ల్యాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉండటంతో.. ఇన్నాళ్లూ ఆ స్థలం HCUదేననే భ్రమలో ఉన్నారు స్టూడెంట్స్. అందుకే, మా భూములు అమ్మొద్దంటూ గొడవ చేస్తున్నారు.
400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే.. నో డౌట్
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని లేటెస్ట్‌గా మరోసారి స్పష్టం చేసింది రేవంత్ సర్కారు. ఆ భూమితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదని తెలిపింది. ఓ ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల కిందట కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని ప్రకటించింది. ఆ 400 ఎకరాల భూముల వేలం, అభివృద్ధి పనులు… అక్కడి రాళ్లను దెబ్బతీయవని స్పష్టం చేసింది. అలాగే, అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువులు కూడా లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
మధ్యలో ఎవర్రా మీరంతా?
డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విద్యార్థులకు మద్దతిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శ వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ చెట్లను కొట్టొద్దని ఓ ప్రెస్‌మీట్లో అనడం మరింత కలకలం రేపింది. ఆయన చెట్ల విషయం మాత్రమే మాట్లాడారు కానీ, ఆ భూములు ఎవరివో ఆయనకు కూడా తెలీదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆ 400 ఎకరాల్లో ఎలాంటి చెరువులు, భారీ వృక్షలు, విభిన్న జంతువులు, పక్షిజాతులు లాంటివి లేవని.. అది రాళ్లు, మామూలు చెట్లతో కూడిన భూమి మాత్రమేనని స్పష్టం చేశారు. అయినా.. హిడెన్ ఎజెండాతో రచ్చ రాజేస్తున్నారని మండిపడుతోంది ప్రభుత్వం.