Medak Flood: తెలంగాణ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంబించింది. రహదారులు వర్షపు నీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో వర్ష ప్రభావంతో మెదక్ జిల్లా రామాయంపేట నీట మునిగింది. స్థానిక హాస్టల్‌లోకి వరద నీరు చేరింది. దీంతో సుమారు 400 మంది విద్యార్థులు నీటిలో చిక్కుకున్నారు. నీరు ఎక్కడికక్కడ ముంచెత్తడంతో విద్యార్థులు బయటకు రావడం కష్టంగా మారింది. పరిస్థితి విషమంగా మారడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ బోట్ల సాయంతో రక్షణ చర్యలు ప్రారంభించాయి. ఇప్పటి వరకు సుమారు 150 మంది విద్యార్థులను విజయవంతంగా కాపాడగలిగారు.
Also Read: Gas cylinder scams: నకిలీ సీల్, నకిలీ బిల్.. గ్యాస్ సిలిండర్ మోసాలు ఎలా గుర్తించాలి?
వరదలో విద్యార్థులు- ఆందోళనలో తల్లిదండ్రులు
వందలాది మంది విద్యార్థులు ఇంకా హాస్టల్‌లోనే ఉండిపోవడంతో ఆందోళన పెరుగుతోంది. వరదలో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులను వేడుకుంటున్నారు. విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తేవడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మిగిలిన విద్యార్థులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో రెస్క్యూ బృందాలకు స్థానికులు కూడా పెద్దఎత్తున ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం హాస్టల్ ప్రాంగణం చుట్టూ పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తేవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. వరద నీరు పూర్తిగా తగ్గేవరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేటలో హాస్టల్స్ లో చిక్కుకున్న 400 మంది విద్యార్థులు
ఫైర్ బోట్ల సాయంతో 150 మంది విద్యార్థులను కాపాడిన రెస్క్యూ బృందాలు
మిగిలిన విద్యార్థులను బయటకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ pic.twitter.com/vj1wKv68FQ
— BIG TV Breaking News (@bigtvtelugu) August 27, 2025