Hyderabad Zoo: హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తెలియని వారు ఉండరు. ఇక్కడ గల జంతువులను చూసేందుకు ఒక్కరోజు టైమ్ సరిపోదు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ జూ. అయితే ఇక్కడ జంతు ప్రేమికులకు సూపర్ ఛాన్స్ ఉందన్న విషయం మీకు తెలుసా. పులి, సింహం పేరు ముందు మీ పేరు ఉండాలా? అయితే ఇప్పుడే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా, ఈ పూర్తి కథనం చదవండి.
ఇక్కడ అంతా జంతు ప్రపంచమే..
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది భారతదేశంలో ప్రసిద్ధమైన జంతుప్రదర్శనశాలల్లో ఒకటి. ఇది నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జూ పార్కుల్లో ఎంతో విశిష్టత కలిగినది. సుమారు 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జూ పార్క్‌లో 150 పైగా జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి.
దత్తత తీసుకొనే ఛాన్స్..
ఇక్కడి జంతువులను కాపాడడానికి, వాటికి మెరుగైన సంరక్షణ కల్పించేందుకు Animal Adoption Programme పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మీరు ఏదైనా జంతువును దత్తత తీసుకుని, దానికి ఆహారం, వైద్యం, ఇతర అవసరాలకు అవసరమైన ఖర్చును భరిస్తారు. ఇది ఒక మంచి పని మాత్రమే కాక, పర్యావరణంపై చొరవ తీసుకునే వ్యక్తిగా మీకు గుర్తింపు కూడా ఇస్తుంది.
ఇలా చేయండి
జంతువులను దత్తత తీసుకోవాలంటే, ముందుగా జూ అధికారిక వెబ్‌సైట్ లేదా నేరుగా జూ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ మీరు దత్తత తీసుకోవాలనుకునే జంతువు జాబితాను పరిశీలించవచ్చు. దానికి గాను నెలలవారీ, సంవత్సరపు ఖర్చు ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. ఆ నిబంధనలను అంగీకరించిన తర్వాత ఫారం పూరించి నగదు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. మీరు చేసే దానంతో పాటు, అధికారిక ధృవీకరణ పత్రం కూడా జారీ చేస్తారు.
ఖర్చు ఇలా ఉండవచ్చు
హైదరాబాద్ జూలో దత్తత తీసుకునే జంతువులలో సింహం, పులి, చిరుతపులి, ఏనుగు, అలాగే జింకలు, పాములు, పక్షులు వంటి అనేక జీవులు ఉన్నాయి. వీటికి దత్తత ఖర్చు కూడా జంతువు బట్టే మారుతుంది. ఉదాహరణకు, సింహం లేదా పులికి సంవత్సరానికి సుమారు రూ. 2 లక్షలు, చిరుతపులికి రూ. 1.5 లక్షలు, జింకలకు రూ. 25,000, పాములకు రూ. 5,000 చొప్పున ఖర్చవుతుంది.
Also Read: Hidden Temple Tirumala: తిరుమలలో రహస్య ఆలయం.. ఇక్కడికి వెళ్లడం ఓ సాహసమే!
మీకేంటి లాభం..
మీరు జంతువును దత్తత తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది, మీరు సహాయం చేసే దానంతో జంతువు మంచి ఆహారం, వైద్యం పొందుతుంది. రెండవది, జంతువు దగ్గర మీ పేరు, లేకుంటే సంస్థ పేరు బోర్డు మీద ప్రదర్శించబడుతుంది. మూడవది, మీరు చేసే విరాళంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. మీరు దత్తత తీసుకున్న జంతువును చూడటానికి ప్రత్యేక పాస్ కూడా ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మీరు జంతువులకు ఒక మంచి జీవితాన్ని అందించడంలో భాగస్వాములు అవుతారు. ఇది పిల్లలలో, యువతలో పర్యావరణంపై చైతన్యం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. పైగా, మీరు ఒక జంతువుకు స్నేహితుడిగా మారి, మీ పేరు చిరస్థాయిగా గుర్తుండేలా చేయవచ్చు.
ఇక్కడ పరిమితులు లేవు..
దత్తత ప్రక్రియలో ఎలాంటి పెద్ద పరిమితులు లేవు. అయితే 18 సంవత్సరాల పైబడి ఉన్నవారే అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు కూడ కలిసి ఒక జంతువును దత్తత తీసుకోవచ్చు. దత్తత కాలవ్యవధి కనీసం ఒక నెల నుంచి మొదలై, సంవత్సరాంతం వరకు కొనసాగుతుంది. మొత్తానికి చెప్పాలంటే, హైదరాబాద్ జూలో జంతువులను దత్తత తీసుకోవడం అనేది మనం ప్రకృతిని కాపాడే మార్గం. ఇది ఒక్క మన మంచికే కాదు, సమాజానికి, భావితరాలకు ఉపయోగపడే గొప్ప అవకాశం. మీరు ఒక్కసారి జూ పార్క్‌కి వెళ్లి ఆ జంతువులను చూసిన తర్వాత, కనీసం ఒక్కదానినైనా దత్తత తీసుకోవాలనే భావన రావడం ఖాయం. మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఓ లుక్కేయండి!