Big Stories

Hyd Rain: మళ్లీ సడెన్‌ రెయిన్.. ఈ నగరానికి ఏమైంది?

hyd rain

Hyd Rain: అప్పటి వరకు ఫుల్ ఎండ కొట్టింది. ఇంట్లో ఉంటే వేడి.. బయటికొస్తే మంట. ఇదేం ఎండరా బాబోయ్ అంటూ జనం బేజార్ అయ్యారు. ఏప్రిల్‌లోనే ఇంత ఎండ ఉంటే.. ఇక మే లో పరిస్థితి తలుచుకుని బెదిరిపోయారు. రోహిణి కార్తె గుర్తుకొస్తే గుండె జారి గల్లంతే.

- Advertisement -

ఇలాంటి సిట్యూయేషన్‌లో ఉన్నట్టుండి సడెన్‌గా వర్షం కురిసింది. చూ మంతర్ కాళీ.. అన్నట్టు ఎవరో మంత్రమేసినట్టు.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండపోయి మబ్బులొచ్చాయి. వేడి పోయి చల్లగాలి వీచింది. నిమిషాల్లోనే నిలబెట్టి వాన కుమ్మేసింది.

- Advertisement -

వానంటే ఏదో నాలుగు చినుకులు రాలడం కాదు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వాన చినుకులతో పాటు వడగళ్లు పడ్డాయి. అప్పటికే రోడ్ల మీదున్న జనం.. పక్కకు వచ్చే సరికే తడిసిపోయారు. వడగళ్లతో దెబ్బలు కూడా తగిలాయి కొందరికి.

దాదాపు నగరమంతా ఇదే సీన్. హైటెక్ సిటీ ప్రాంతంలో మబ్బులు పట్టినా.. వాన పడలేదు. ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి, నారాయణగూడ సైడ్ వాన దంచి కొట్టింది. అసలే ఆఫీసులు ముగిసి ఇంటికెళ్లే టైమ్ కావడంతో.. ఇంకేం ఫుల్ ట్రాఫిక్ జామ్స్. హైదరాబాద్ మరోసారి నరకంగా మారింది. కాక్‌టెయిల్ వెదర్‌తో తీవ్ర ఇబ్బంది పడింది.

మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా ఎక్కువగా ఎండలు నమోదు కావడం కలవరపెడుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్, ఆసిఫాబాద్ జిల్లా జంబుగల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అటు ఏపీలోనూ పలు మండలాల్లో వడగాల్పులతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ.. ఒకవేళ బయటకు వెళ్లడం తప్పనిసరైతే.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాలో.. వడగాల్పుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News