AICC KC Venu Gopal: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దృష్టి పెట్టింది హైకమాండ్. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటి సమావేశం-పీఏసీ సమావేశం జరగనుంది. తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హాజరవుతున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం, లోకల్ బాడీ ఎన్నికలు, పీసీసీ కమిటీలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. పాలన తీరుపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు జరిగిన తీరుపై విశ్లేషించనున్నారు. రాబోయే నాలుగేళ్లలో పార్టీని పటిష్ట పరిచేందుకు ఎలాంటి పాలన చేయాలనే దానిపై కీలక సూచనలు ఇవ్వనున్నారు.
ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యకర్గంపై చర్చ వచ్చే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మార్చిలో రానున్న లోకల్ బాడీ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై నేతలను దిశా నిర్థేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోపాటు పీఏసీకి చెందిన 23 మంది సభ్యులు హాజరుకానున్నారు. వీరితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలు, ఏఐసీసీ ఆఫీసు బేరర్లు ఉంటారని సమాచారం.
ALSO READ: అలర్ట్ .. హైదరాబాద్‌లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు