Revanth Reddy: భాగ్యనగర రూపురేఖలను పూర్తిగా మార్చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. హైదరాబాద్‌ను చెత్త రహితంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంచలన ఆదేశాలు జారీ చేశారు. నగర పారిశుధ్యం నుంచి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వరకు పలు కీలక అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
చెత్త కనిపిస్తే చర్యలు తప్పవు!
నగరంలో ఎక్కడా చెత్త అనేది కంటికి కనిపించకుండా చూడాలని సీఎం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని, ఈ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా, నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో ఐలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
గ్రీన్ వాటర్ విప్లవం
తాగునీటిని ఆదా చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పార్కుల నిర్వహణ, నిర్మాణ పనులకు ఇకపై తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో తొలివిడతగా 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని సరఫరా చేయనున్నారు.
సిగ్నల్ ఫ్రీ భాగ్యనగరం
నగరవాసులకు నిత్యం నరకం చూపుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. సిగ్నళ్ల వద్ద వాహనాలు నిమిషాల తరబడి నిలిచిపోకుండా ‘సిగ్నల్ ఫ్రీ’ వ్యవస్థను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అవసరమైన రద్దీ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు.
Also Read: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం బిగ్ అప్‌డేట్.. రూ. 275 కోట్ల నిధులు మంజూరు!