
Amit Shah News(BJP News Telangana) : చేవెళ్ల బీజేపీ శంఖారావం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ విజయఢంకా మోగించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మరి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలా? వద్దా? అని అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి గట్టిగా వినపడేలా నినదించాలని కోరారు. BRS ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అమిత్ షా స్పష్టం చేశారు.
దేశంలో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని అమిత్ షా అన్నారు. మళ్లీ ప్రధానిగా మోదీయే బాధ్యతలు చేపడతారని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఓవైసీ అజెండాపై కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. అందుకే
తెలంగాణలో విమోచన దినాన్ని కూడా జరపడంలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తామని ప్రకటించారు.
కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. మజ్లిస్ అంటే బీజేపీకి భయంలేదని స్పష్టం చేశారు. తెలంగాణలోకి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు బీసీ,ఎస్సీ, ఎస్టీలకే దక్కాలని స్పష్టం చేశారు. ముస్లింల రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు.
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని అమిత్ షా ఆరోపించారు. TSPSC పేపర్ లీకేజీపై కేసీఆర్ పెదవి విప్పడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా జైలులో పెట్టిందన్నారు. సంజయ్ ఏం తప్పు చేశారు? అని అమిత్ షా నిలదీశారు.
చేవెళ్ల సభలో పాల్గొనడానికి ముందు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో అమిత్ షా పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, కార్యక్రమాలపై చర్చించారు. మొత్తంమీద ఒక్కరోజు పర్యటనతోనే అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అధికారంలోకి రావడమే లక్ష్యమని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు.