Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి కంటిన్యూగా ఓ పది రోజులు వానలు దంచికొట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో వానలు భారీగా కురిశాయి. అయితే గత నాలుగైదు రోజు వరుణడు కాస్త విరామం ప్రకటించాడు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండూ తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇవాళ, రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గణనీయంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబాబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అల్పపీడనం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ వర్షాల వల్ల రహదారులు దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది.. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.
ALSO READ: Mysore News: వీడు ఎంత నీచుడంటే.. లవర్ నోట్లో బాంబు పెట్టి చంపేశాడు.. చివరకు..?
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని చెప్పారు. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.