CAG Report: భారతీయ రైళ్లలో పరిస్థితుల గురించి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) సంచలన విషయాలు వెల్లడించింది. ముఖ్యంగ పారిశుధ్య నిర్వహణ మరీ దారుణంగా ఉన్నట్లు తెలిపింది. మురికి వాష్ రూమ్ లు, దుర్వాసన వెదజల్లే వెస్టిబ్యూల్ లు, నీటి కొరత ఉన్నట్లు వివరించింది. మధ్య, దక్షిణ మధ్య రైల్వే (SCR) నడిపే సుదూర రైళ్లలో పారిశుధ్యం, నిర్వహణ ప్రమాణాలు అనుకున్న స్థాయిలో లేవని తేల్చింది. కాగ్ రిపోర్టు ప్రయాణీకుల సౌకర్యం, ప్రజారోగ్యాన్ని ఆందోళకు గురి చేస్తుంది.
రైళ్లలో నీటి కొరత
కాగ్ ఆడిట్ లో పలు రైళ్లలో నీటి కొరత ఉన్నట్లు వెల్లడి అయ్యింది. నెట్ వర్క్ లోని అనేక ప్రాంతాలలో నీటి సరఫరా లేకపోవడాన్ని కాగ్ ఎత్తిచూపించింది. కాట్పాడి–విజయవాడ (559 కి.మీ), రేణిగుంట–విజయవాడ (450 కి.మీ) వంటి మార్గాల్లో ఇంటర్మీడియట్ వాటర్ పాయింట్లు లేవని తెలిపింది. దీని వలన ప్రయాణీకులు గంటల తరబడి పని చేయని టాయిలెట్లు, వాష్ బేసిన్లతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. బల్హర్షా–సికింద్రాబాద్, గూడూరు–విజయవాడ లాంటి ఇంటర్-జోనల్ క్రాసింగ్ లలో ఫిర్యాదులు తీవ్రంగా ఉన్నాయని తెలిపింది. ఇక్కడ రైల్వే జోన్ల మధ్య సమన్వయ లోపాలు కొరతను మరింత తీవ్రతరం చేసినట్లు వివరించింది. కొత్త వాటర్ పాయింట్లు పరిశీలనలో ఉన్నాయని అధికారులు అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం కొన్ని స్టేషన్లపై ఆధారపడటం వల్ల రైళ్లలో నీటి సమస్య ఎదురవుతున్నట్లు తెలిపింది.
రైల్వే శుభ్రతపైనా అసంతృప్తి
రైళ్ల టాయిలెట్ శుభ్రతకు సంబంధించిన 89% ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించినప్పటికీ, మొత్తం పరిస్థితులు పేలవంగా ఉన్నాయని కాగ్ గుర్తించింది. కాగ్ పరిశీలించిన 15 రైళ్లలో 13 రైళ్లలో టాయిలెట్లు, వాష్ బేసిన్లు అత్యంత మురికిగా ఉన్నట్లు తెలిపింది. AC కోచ్‌లలో బయో టాయిలెట్లు, నాన్ AC తరగతుల కంటే మెరుగ్గా నిర్వహించబడ్డాయి. కానీ, తూర్పు తీరం, పశ్చిమ, తూర్పు రైల్వే జోన్ లలో ప్రయాణీకుల అసంతృప్తి ఇప్పటికీ 50 శాతానికి పైగా ఉన్నట్లు గుర్తించింది. దీనికి విరుద్ధంగా, ఉత్తర, ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని ప్రయాణీకులు శుభ్రత విషయంలో 90% కంటే ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపింది.
Read Also: రైలు ఎన్ని గంటలు ఆలస్యమైతే ఫుల్ రీఫండ్ ఇస్తారు? ఈ కొత్త రూల్ గురించి తెలుసా?
క్లీన్ రైల్వే స్టేషన్ల పథకం పని తీరు బాగాలేదన్న కాగ్
రైళ్లను శుభ్రపరచడానికి ఉద్దేశించిన క్లీన్ రైలు స్టేషన్లు (CTS) పథకాన్ని కాగ్ నివేదిక విమర్శించింది. 12 జోన్ లలోని 29 స్టేషన్లలో తనిఖీలలో యంత్రాల పరిమిత వినియోగం, తగినంత మ్యాన్ పవర్ లేకపోవడం పేలవమైన పనితీరుకు కారణం అయినట్లు తెలిపింది. కాంట్రాక్టు సిబ్బంది పోలీసు ధృవీకరణలో లోపాలను కూడా CAG గుర్తించింది. సేవలను మెరుగుపరచడానికి మెరుగైన ఇంటర్ జోనల్ సమన్వయం, ప్రత్యేక పారిశుధ్య బడ్జెట్, కఠినమైన తనిఖీలను కొనసాగించాలని కాగ్ సూచించింది.
Read Also: రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం బంద్.. అసలు విషయం చెప్పిన కేంద్రం!