ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. జీవన్‌రెడ్డి మాల్‌కు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు బకాయిల వసూలు కోసం నోటీసులు జారీ చేయగా.. తాజాగా బ్యాంక్‌లోన్లూ తీసుకుని కనీసం వడ్డీ కూడా చెల్లించలేదంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది.
2017లో తన భార్య పేరు మీదు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి జీవన్ రెడ్డి 20 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. అప్పటి నుంచి అప్పు చెల్లించకపోగా, … కనీసం వడ్డీ కూడా కట్టకపోవడంతో ఆర్మూర్‌లోని తన ఇంటి తలుపులకు బ్యాంక్ సిబ్బంది నోటీసులు అంటించారు. దీంతోపాటు ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో జీవన్ రెడ్డికి చెందిన మాల్ విషయంలోనూ నోటీసులు జారీ అయ్యాయి.
ఈ మాల్‌ను జీవన్ రెడ్డి భార్య రజిత రెడ్డి తాను ఎండీగా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లీజ్‌కు తీసుకుని ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. మాల్‌ను నిర్మించి వివిధ వ్యాపార సంస్థలకు అద్దెకు ఇచ్చారు. అయితే గతేడాది దీనిని ప్రారంభించగా.. ఇందుకు సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించలేదు. ఇప్పటి వరకు జీవన్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు అద్దె అడిగే ధైర్యం చేయలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జీనవ్‌రెడ్డి ఓడిపోవడం, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రావడంతో ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయి మొత్తం 7 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గడువు లోపల చెల్లించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోపక్క జీవన్‌రెడ్డిపై మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ నేత చీకటి దందాలను అరికట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే,.. జీవన్‌రెడ్డి తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని,.. వందలాదిగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు రాకేశ్‌రెడ్డి. క్వారీ తవ్వకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరినందుకే జీవన్‌రెడ్డి బెదిరిస్తున్నాడని తెలిపారు ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి.