Bandham Cheruvu: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్ పల్లి గ్రామ బంధం చెరువు మత్తడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దివాగులోకి భారీగా నీటిని వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మత్తడికి గండిపడి చెరువులో నీరు ఖాళీ అయినా 15 రోజులు గడిచిన యంత్రాంగంలో స్పందన లేకపోవడం గమనార్హం. ఈ చెరువు మత్తడి పారితే హల్దివాగులో కాలేశ్వరం నీళ్లు పరుగులు తీస్తాయి. నీటి ప్రవాహా ఉధృతికి బంధం చెరువు మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. చెరువులో నిల్వ ఉండే నీరు సుమారు 70 శాతం బయటకు వెళ్లిపోగా గత 15 రోజులుగా నిల్వ నీరు పూర్తిగా అడుగంటిందని గ్రామస్తులు చెబుతున్నారు.
కాలేశ్వరం జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్ది వాగులోకి వదలడానికి ముందుగా ఈ బంధం చెరువులోకి విడుదల చేస్తారు. తొలిసారి ఈ చెరువులోకి అప్పటి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ చెరువు నుండి వర్గల్ పెద్ద చెరువు, శాకారం చెరువు నుండి ఖాన్ చెరువు ద్వారా హల్ది వాగులోకి నీరు ప్రవహిస్తుంది. నాచగిరి పుణ్యక్షేత్రం వద్ద చెక్ డ్యామ్ ముత్తడి దూకి తూప్రాన్ మీదుగా హల్ది వాగులో ప్రయాణించి మంజీరా నది లోకి చేరుతుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి సంగారెడ్డి, రామాయంపేట కాలువలకు నీటిని వదిలారు. నాచగిరి బ్రహ్మోత్సవాలు ఉన్నందున హల్దివాగులోకి నీటిని పెద్ద మొత్తంలో విడుదల చేశారు. ఈ ప్రవాహా ఉధృతికి బంధం చెరువు మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. చెరువులోని నీరు 70% బయటికి వెళ్లిపోయింది.
Also Read: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!
బంధం చెరువు కట్ట బలహీనంగా ఉందిని గుర్తించి నాలుగేళ్ల క్రితమే చెరువు కట్ట, మత్తడి మరమ్మతులకు సుమారు రూ 70 లక్షలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అధికారులు పట్టించుకోక పోవడంతో పనులు జరగలేదు. చెరువు కట్ట, మత్తడి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని నీటిని వదలవలసి ఉండగా అధికారులు ఇదేది పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో నీటిని వదలడంతో మత్తడి కొట్టుకుపోయినట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా బంధం చెరువును కూడా పర్యాటక కేంద్రంగా మార్చడానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. మత్తడిని, కట్టను పటిష్టం చేసి మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరించాలని పేర్కొన్నారు.
Also Read: రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!