పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ 2026లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ స్పీకర్ మండలి చైర్మన్ సమక్షంలోనే ఇంతటి ఉల్లంఘన జరిగినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును నిలదీస్తూ కీలక ప్రశ్నలు సంధించారు.
వందేమాతరం గేయం ఆలపిస్తున్న సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ అత్యంత సన్నిహిత మిత్రపక్షం కావడంతోనే నోటీసులివ్వడానికి ప్రభుత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఇచ్చిన ఇటీవలి తీర్పుతో ఇప్పటికే శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిండు సభలో జాతీయ గేయానికి అవమానం జరిగినా చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా సభలో ఉన్న సమయంలోనే మజ్లిస్ నేతలు వందేమాతరాన్ని అవమానించారని బండి సంజయ్ గుర్తు చేశారు. సభ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత పాలకులకు లేదా అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిరోజూ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతుంటారని ఇటువంటి కనీస విషయాలు ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించే సోయి ఈ ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రథమ పౌరుడైన గవర్నర్ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బండి సంజయ్ హెచ్చరించారు. దేశ గౌరవానికి చిహ్నమైన వందేమాతరాన్ని తృణీకరించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. కేంద్ర ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని ఆయన స్పష్టం చేశారు.