Future AI Home Gadgets: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన ఇంటిని, మన మూడ్‌ను అర్థం చేసుకుని అన్నీ తానై చూసుకునే ఒక మనిషి ఉంటే ఎలా ఉంటుంది? రోజూవారీ పనులన్నీ మనమే చేసుకోవాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, మనకోసం ఒక పర్సనల్ అసిస్టెంట్ ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ మజాయే వేరు కదా. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మాత్రమే చూసిన ఇలాంటి అద్భుతాలు ఇప్పుడు నిజంగానే మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ పుణ్యమా అని మన ఇళ్లు కేవలం గోడలు, గదులు కాకుండా మనతో పాటు ఆలోచించే బెస్ట్ ఫ్రెండ్‌లా మారిపోతున్నాయి.
ఇకపై మనం ప్రతి చిన్న పనికి రిమోట్లు పట్టుకోవడం, ఫోన్లలో యాప్స్ ఓపెన్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. LG లాంటి కంపెనీలు తీసుకొస్తున్న ఏఐ హోమ్ టెక్నాలజీతో ఇంటిలోని అన్ని ఉపకరణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. మన డైలీ రొటీన్, మన టైమ్ టేబుల్ అన్నీ ఆ ఏఐ సిస్టమ్‌కు ముందే తెలుస్తాయి. మనం చెప్పకపోయినా మన మూడ్‌ను బట్టి కరెంట్ ఆదా చేయడం, ఏసీ టెంపరేచర్ సెట్ చేయడం లాంటి పనులను అదే చూసుకుంటుంది.
వంటగదిలో మనకు సాయం చేయడానికి ఇప్పుడు ఏఐ ఫ్రిజ్‌లు, ఓవెన్లు వచ్చేస్తున్నాయి. ఫ్రిజ్‌లో ఏ పదార్థాలు ఉన్నాయి, వాటి గడువు ఎప్పుడు ముగుస్తుందో కెమెరాల ద్వారా ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లు ఇట్టే పసిగట్టేస్తాయి. అంతేకాదు.. ఉన్న వాటితో ఏం వంట చేసుకోవచ్చో అప్పటికప్పుడు రుచికరమైన రెసిపీలను కూడా అవే సజెస్ట్ చేస్తాయి. ఓవెన్లు కూడా లోపల ఉన్న ఆహారాన్ని బట్టి ఎంత వేడి ఇవ్వాలో ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటున్నాయి.
Also Read: అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!
ఇంటి పనుల్లో పెద్ద తలనొప్పిగా ఉండే బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం లాంటి వాటికి ఏఐ టెక్నాలజీ అద్భుతమైన సొల్యూషన్ ఇస్తోంది. శాంసంగ్ బెస్పోక్ వాషింగ్ మెషీన్లు బట్టల క్వాలిటీని బట్టి ఎంత నీరు, పౌడర్ కావాలో చూసుకుని కరెంట్ కూడా ఆదా చేస్తాయి. ఇక మిలే డిష్ వాషర్లలో ఉండే కెమెరాలు గిన్నెలను గుర్తించి, దానికి తగిన వాష్ సైకిల్‌ను అవే సెలెక్ట్ చేసుకుంటున్నాయి.
కేవలం ఇల్లు ఊడ్చే రోబోల కాలం ఎప్పుడో చెల్లిపోయింది. భవిష్యత్తులో రాబోయే హోమ్ రోబోలు ఇళ్లలోని రూమ్స్ అన్నీ తెలుసుకుని, వస్తువులను గుర్తుపట్టి మనకు అన్ని పనుల్లో సాయం చేస్తాయి. ఎల్‌జీ లాంటి బ్రాండ్లు ఇప్పుడు ఇలాంటి స్వయంగా నిర్ణయాలు తీసుకునే రోబోలను తయారు చేస్తున్నాయి. ఇవి ఇల్లు మొత్తం తిరుగుతూ కనెక్ట్ చేసిన అప్లయన్సెస్ అన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తున్నాయి.
కేవలం పనులే కాకుండా ఇంటి భద్రత, కరెంట్ బిల్లుల టెన్షన్‌ను కూడా ఏఐ పూర్తిగా దూరం చేస్తుంది. స్మార్ట్ కెమెరాలు ఎవరైనా కొత్తవారు వస్తే ఇళ్లలోని వాళ్లకు ఇన్‌స్టంట్‌గా అలర్ట్ చేస్తాయి. అలాగే సోలార్ పవర్, బ్యాటరీలు, గృహోపకరణాల వాడకాన్ని బట్టి ఏఐ ఎనర్జీ హబ్స్ కరెంట్ వాడకాన్ని తెలివిగా మేనేజ్ చేస్తున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో మన ఇళ్లు మరింత సురక్షితంగా, సౌకర్యంగా మారడం ఖాయం.
Also Read: వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!