Banjara Yatra: స్వేచ్ఛ బ్యూరో: బంజారా జోడో ఏక్తా భారత్ యాత్రను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి, బంజారా భారత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ధరావత్ రవీంద్ర నాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ సేవాగఢ్(గుత్తి) నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. బంజారాల్లో ఐక్యత కోసమే ఇదంతా చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. బంజారా జోడో ఏక్తా భారత్ యాత్రకు తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుంచి భారీ సంఖ్యలో బంజారాలు పాల్గొని బంజారా జోడో ఏక్తా భారత్ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని బంజారాలను 78 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, వాటి తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర రాక పూర్వం ఆసీయఖండమంతటా ఎందరో బంజారా యోధులు తమ కార్వాన్లు, ఎడ్లబండ్లపై, గుర్రాలపై, ఒంటెలపై నిత్యావసర వస్తువులు, ఉప్పు, గన్ పౌడర్, యుద్ధ సామగ్రిని, క్రూర జంతువుల దాడులను ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం ఒడ్డి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. హిందువుల ఊచకోత జరుగుతున్న సమయంలో కూడా సిక్కు గురువుల నాయకత్వంలో వీర బంజారాలు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారన్నారు. బ్రిటీష్ దోపిడిని అడ్డుకుని వారికి లొంగనందుకు బ్రిటీష్ వాళ్లు బలవంతంగా బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ గా ముద్రవేసి అనేక బాధలు పెట్టినా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారన్నారు.
Also Read: పూనకాలు తెప్పిస్తున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. నల్లమందు సామ్రాజ్యంలో డెవిల్ వేట!
దేశంలోని బంజారాల అనేక ఆస్తులను, భూములను బ్రిటీషర్లు దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని, న్యూఢిల్లీ లోని రాయసీనా హిల్స్ వద్ద 670 ఎకరాల భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోనే వైస్రాయ్ భవన్.. అదే నేటి రాష్ట్రపతి భవన్ గా మారిందన్నారు. నార్త్ సౌత్ అవెన్యూ ఎంపీ నివాసాలు, బంజార బావడి, లక్కీషా బంజార హాల్ తో సహా రకాబ్ గంజ్ గురుద్వారా, నార్త్/సౌత్ కేంద్ర కార్యాలయాలు, పార్లమెంట్ భవన్ సముదాయాలు, బోట్స్ క్లబ్, జంతర్ మంతర్, ఇండియాగేట్ తదితర ప్రాంతాలున్నాయని రవీంద్ర నాయక్ తెలిపారు. అలాంటి బంజారాలను 78 సంవత్సరాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యూఢిల్లీలోని 670 ఎకరాల భూమికి బదులు అదే ఢిల్లీలో లేదా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బంజారాలకు భూమి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లక్కీషాహ్ బంజార, మాఖంషాల నిలువెత్తు కాంస్య విగ్రహాలను పార్లమెంట్ భవన్ సముదాయం వద్ద ఏర్పాటుచేయాలన్నారు. అలాగే రాయసీన హిల్స్ నుంచి ప్రారంభమయ్యే అన్ని రోడ్లు, కూడళ్లకు బంజార ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బంజారాల వీరోచిత పోరాటాలకు గుర్తింపుగా బంజార రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సవ్యసాచి బంజార శివ బాబా, రిటైర్డ్ ఐపీఎస్, సేవా గఢ్ అధ్యక్షుడు జగన్నాథరావు, బంజార నాయకులు రవినాయక్ రాథోడ్, కమల్ రాథోడ్ తదితరులున్నారు.
Also Read: తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. మూడేళ్ల దాకా పైసలు ఫ్రీ..!