
Bank robbery in Telangana(local news telangana):
బ్యాంక్‌కు కాంప్లిమెంట్ ఇచ్చాడు ఓ దొంగ. మామూలోడు కాదు. తన ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకవని.. తనని పట్టుకునే ప్రయత్నం చేయొద్దంటూ పోలీసులకు కూడా కష్టం లేకుండా ఉచిత సలహా ఇచ్చేశాడు.
మంచిర్యాల జిల్లా నెన్నలలో దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో గురువారం రాత్రి చోరీ యత్నం జరిగింది. ఒక్క రూపాయి కూడా పోలేదు. అసలక్కడ డబ్బు ఉంటే కదా పోవడానికి. ఈ మాట చెప్తున్నది ఆ బ్యాంక్‌కు కన్నం వేసేందుకు వచ్చిన ఆ దొంగ.
మారుమూల మండలం కావడం.. చిన్న మొత్తాల పొదుపు మాత్రమే అక్కడ నడుస్తుండడం.. నెలాఖరు కావడంతో ఆ బ్రాంచ్‌లో డబ్బుల్లేవు. ఆ దొంగ.. టైమింగ్ చూసుకోకుండా కన్నం వేసేశాడు. భారీగా కాజేయవచ్చు అనుకున్న అతని ఆశలు అడియాసలయ్యాయి. బాాగా డిసప్పాయింట్ అయ్యాడు.
కష్టపడి కన్నం వేస్తే.. చేతికి చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో దొంగ తీవ్ర నిరాశ చెందాడు. అయినా, బాధ దిగమింగుకొని.. ఈ బ్యాంక్ గొప్పదంటూ కితాబిచ్చాడు. పోతూ పోతూ ఓ లెటర్ కూడా రాసి వెళ్లాడు. మీ బ్యాంక్‌లో ఒక్క పైసా కూడా దొరకలేదు. ఇది గుడ్ బ్యాంక్. నన్ను పట్టుకోవద్దు. ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకవంటూ అక్కడున్న ఓ న్యూస్ పేపర్‌పై రాసిపెట్టి జంప్ అయ్యాడు.