Telangana Bandh: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీసీ సంఘాలు నిరసనకు దిగాయి. హైకోర్టు తీర్పుకు నిరసనగా నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇది బీసీల ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బంద్ పిలుపుతో రాష్ట్రంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 42 శాతం రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు తదుపరి విచారణ, ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
బీసీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళన..
హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హైకోర్ట్ ప్రాంగణంలో గుమిగూడారు. రిజర్వేషన్లు, నోటిఫికేషన్ అంశాలపై న్యాయస్థానం స్టే విధించిన వెంటనే.. బీసీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. హైకోర్టు గేట్ నెంబర్ 4 వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.
రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్.కృష్ణయ్య
తమకు అన్యాయం జరిగిందని, బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు వస్తుంటే కొందరు ఓర్వలేక ఈ విధంగా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించిన బీసీ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన సంఘాల నేతలు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వాకిటి శ్రీహరి..
బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో ఎలాగైతే ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో అదే మాదిరిగా రిజర్వేషన్ల విషయంలోనూ ముందుకెళ్తామన్నారు. ఈ విషయంలో బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడవద్దన్నారు మంత్రి వాకిటి శ్రీహరి.
నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు -ఆర్ కృష్ణయ్య..
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే చాలా దురదృష్టకరమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా స్టే ఇవ్వడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇది ముమ్మాటికీ బీసీల హక్కులకు విఘాతం కల్పించడమేనన్నారాయన. నోటికాడ అన్నం ముద్దను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. ఇందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. సర్కారు స్పందన ఎలా ఉంటుందన్న దానిపై చర్చించి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు ఆర్ కృష్ణయ్య.