Big Stories

High Alert in Hyderabad : హైదరాబాద్ లో హై అలర్ట్.. బస్టాండ్లు, వాహనాల్లో క్షుణ్ణంగా తనిఖీలు

high alert in hyderabad
high alert in hyderabad

High Alert in Hyderabad due to Banglore Blast(Hyderabad latest updates): బెంగళూరు పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. ఓ కేఫ్‌లో జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోను పోలీసులు అప్రమత్తం అయ్యారు. మూడు కమీషనరేట్ల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. జంట నగరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. MGBS, JBSతోపాటు షాపింగ్ మాల్స్ వంటి జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెకింగ్స్ ముమ్మరం చేశారు. కొన్నిచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -

శుక్రవారం అర్థరాత్రి.. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లు పలు చోట్ల పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. బెంగళూరులో పేలుడుతో అలర్టైన హైదరాబాద్ పోలీసులు.. యూసుఫ్ గూడ, మైత్రివనం, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అనుమానాస్పద వాహనాలను చెక్ చేశారు.

- Advertisement -

బెంగళూరు వైట్ ఫీల్డ్ పరిధిలోని కుందనహళ్ళి గ్రీన్ అవెన్యూలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుడులో పదిమంది గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ ఘటన ఐఈడీ బాంబు పేలుడు వల్లే సంభవించినట్టు ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారన్నారు. ఆగంతకులు కేఫ్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాష్ బేసిన్ వద్ద ఒక బ్యాగ్ వదిలి వెళ్ళిపోయినట్టు సీసీ టీవీలో నమోదైనట్టు సీఎం సిద్ధరామయ్య వివరించారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read More : అది బాంబు దాడే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై కర్ణాటక సీఎం..

బెంగళూరులో రామేశ్వరం కేఫ్ చాలా ఫేమస్. మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో పేలుడు ఘటన సంభవించినప్పుడు కేఫ్‌లో సుమారు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు పేలుడు జరిగిందని కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ దివ్య తెలిపారు. పది సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పేలుళ్ళు సంభవించాయని ఆమె పేర్కొన్నారు. బయటినుంచి వచ్చిన ఇద్దరు కస్టమర్లు వాష్ బేసిన వద్ద ఒక బ్యాగ్ వదిలి వెళ్ళారని తెలిపారు. అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో కస్టమర్లతోపాటు హోటల్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ కార్మికులతో పాటు మైక్రోచిప్ కంపెనీ ఉద్యోగులు ఐదుగురు ఉన్నారు. వీరిలో స్వర్ణనారాయణ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే.. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించారు. సమాచారం అందగానే ఘటనా ప్రాంతానికి చేరుకున్న, బాంబు స్క్వాడ్, ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు ఘటనాప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. టైమర్ తోపాటు ముడి ఐఈడీ పదార్థాలు, ఇనుప బోల్టులు, పసుపు రంగు పౌడర్,బ్యాటరీ ఉన్న సంచిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఐఈడీ బాంబు పేలుడే అని నిర్ధారించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలోనే మరో బ్యాగును కూడా గుర్తించారు. ఎన్ఐఏ, సీసీబీ, ఇంటెలిజెన్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ లు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి.

Read More : అయ్యబాబోయ్, అంబానీ కొడుకు పెళ్లికి అన్నికోట్లా.?

గతంలోనూ ఈ కేఫ్ లో అనుమానాస్పద బ్యాగులను గుర్తించినట్టు కేఫ్ ఎండీ దివ్య వెల్లడించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బహుశా డమ్మీ బ్యాగులతో ఆగంతకులు రెక్కీ నిర్వహించారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. రామేశ్వర్ కేఫ్‌లో పేలుడును తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్టు డీప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News