Hyd Bangalore Weather update: కర్ణాటక రాష్ట్రం వర్షాలతో తడిసి ముద్దయింది. ప్రధానంగా బెంగుళూరు నగరం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందట. నగరంలోని ఏ ప్రాంతం చూసినా, జలమయం. అందుకే అక్కడి ఉద్యోగులకు కంపెనీలు ఓ కీలక సూచన చేశాయి. అయితే హైదరాబాద్ నగరానికి కూడా వర్షం పొంచి ఉంది. మరీ అదే పరిస్థితి ఇక్కడ కూడా తప్పదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఇప్పుడు బెంగుళూరు పరిస్థితి ఎలా ఉందంటే?
బెంగళూరులో మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన భారీ వర్షాలు నగర వాసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉరుములతో కూడిన ఈ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో సాధారణ జీవనాన్ని స్తంభింపజేశాయి. ఇప్పటికే వాతావరణ శాఖ (IMD) నగరానికి రెండు రోజుల ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 21 నుండి 26 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
వర్షాలు పడుతున్నది కేవలం ఒకరోజు కాదు. గత రెండు వారాలుగా కురుస్తున్న మోస్తారు నుండి తీవ్రమైన వర్షాల కారణంగా ఇప్పటికే 23 జిల్లాల్లో సాధారణం కంటే 60 శాతం అధిక వర్షపాతం నమోదైంది. బెంగళూరు అర్బన్ జిల్లాలో మాత్రమే మే 1 నుండి 20 మధ్య 278 మి.మీ వర్షపాతం నమోదైంది, ఇది సాధారణం కంటే 157 శాతం ఎక్కువ.
బెంగళూరులో మంగళవారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల్లో 37 మి.మీ వర్షం కురిసింది. ఇందులో రాజరాజేశ్వరి నగర్ (150 మి.మీ), కెంగేరి (144 మి.మీ), విద్యాపీఠ (128 మి.మీ), నాయందహళ్లి (123 మి.మీ) వంటి ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
ట్రాఫిక్ స్తంభన..
వర్షాల కారణంగా బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి పూర్తిగా అతలాకుతలమైంది. ముఖ్యంగా హోసూర్ రోడ్, సిల్క్ బోర్డ్, కస్తూరి నగర్, హూడి, బన్నెఘట్ట మెయిన్ రోడ్, గౌరగుంటెపాల్య వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు తీవ్రంగా ఉన్నాయి. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే లో నీరు నిలవడం వల్ల హోసూర్ రోడ్‌ను కొంతసేపు మూసివేశారు. ఆ తరువాత ఉదయం 10:45 గంటలకు తిరిగి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేసే ఉద్యోగులు 7 కి.మీ ప్రయాణానికి 2 గంటల సమయం పట్టిందట. ఇదే విషయాన్ని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్..
బెంగళూరులోని ఐటీ కారిడార్ అయిన ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న కంపెనీలు ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో తదితర సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పని చేయాలని సూచించాయి. మరికొన్ని కంపెనీలు వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను తప్పనిసరి చేశాయి.
జలదిగ్బంధం..
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గదులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. BTM లేఅవుట్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ కాంపౌండ్ గోడ కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. అదే అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ షాక్‌తో 12 ఏళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
Also Read: Vande Bharat Train Pilot: వందే భారత్ పైలట్ డ్యూటీ సీక్రెట్స్.. అంత ఈజీ కాదు భయ్యా!
అధికారుల అప్రమత్తత..
కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం మే 21 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందే ప్రకటించింది. అధికారుల పరంగా అప్రమత్తత ఉన్నా, తక్షణ సమస్యల పరిష్కారంలో అంతగా అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు సూచనలు
రవాణా సేవలపై ఆధారపడే వారు ముందుగా ట్రాఫిక్ వివరాలు తెలుసుకొని ప్రయాణించాలి. లోతట్టు ప్రాంతాల నివాసితులు భద్రతా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర సర్వీసులు పొందడానికి BBMP హెల్ప్‌లైన్‌ను వినియోగించాలి. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు ఉందని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది. బెంగుళూరు లాంటి నగరంలో వర్షం దెబ్బకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే, హైదరాబాద్ నగరంలో రానున్న రెండు రోజుల్లో అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.