Bhatti Vikramarka: ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు ప్రభుత్వం ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారం చూపుతోందని ఆయన తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 38,738 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండగా, మరో 29,715 మంది కాంట్రాక్ట్ కార్మికులు సేవలు అందిస్తున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక హామీలను అమలు చేయనుంది.
డిపెండెంట్ ఉద్యోగాలు.. మారుపేర్ల సమస్యకు పరిష్కారం
ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తోంది. అలాగే, గత పదేళ్లుగా వేధిస్తున్న మారుపేర్ల ఉద్యోగాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక రాగానే త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.
వైద్య రంగంలో కీలక మార్పులు
కార్మికుల సౌకర్యార్థం మెడికల్ ఇన్వాలిడేషన్ పరీక్షల విధానంలో కీలక మార్పు తెచ్చారు. ఇప్పటివరకు దీనికోసం కొత్తగూడెం వెళ్లాల్సి వచ్చేది. ఇకపై కార్మికులు స్థానికంగా ఉండే సింగరేణి ఏరియా ఆసుపత్రిలోనే ఈ పరీక్షలు చేసుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా, సింగరేణి ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
విద్య, వసతి, మౌలిక వసతులు
సింగరేణి ప్రాంతంలోని పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులలో విద్యుత్ ఆదా కోసం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. రామగుండంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం యోచిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని కాలేజీలను ఆధునీకరించి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, శిథిలావస్థకు చేరిన పాత క్వార్టర్లను తొలగించి కార్మికుల కోసం సరికొత్త క్వార్టర్లను నిర్మించనున్నారు.
దసరా కానుకగా భారీ బోనస్
ఈ ఏడాది సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌గా ఏకంగా 34 శాతం వాటా ప్రకటించారు. అదేవిధంగా, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ. 5,550 చొప్పున అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.
Also Read: రాహుల్ గజం ఎగిరితే.. రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నాడు!: కిషన్ రెడ్డి