Bhatti Vikramarka: స్వార్థంగా ఆలోచించే నైజం వారిది, అందుకే సమగ్ర కుటుంబ సర్వేను గూర్చి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అసలు భారత రాజ్యాంగం అంటే తెలుసా? కేవలం వారికి మాత్రమే రాష్ట్ర వనరులు అందాలన్నది వారి ఆలోచన. అందుకే హరీష్ రావు లాంటి వారు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తమ నేత రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సర్వేను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని, సర్వే ద్వారా వచ్చిన డేటాతో భవిష్యత్ లో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. అలాగే రాహుల్ గాంధీ సైతం హైదరాబాద్ కు వచ్చి, సర్వే జరిగే తీరు గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా తాజాగా సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. కుల గణన పై ఎన్నికలకు ముందే, దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కుల గణన తో వనరులు, ఆస్తులు సమానంగా అందాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని, కావాలని కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలా విమర్శలు చేస్తున్న వారు, కేవలం వారికి మాత్రమే రాష్ట్ర వనరులు దక్కాలన్న ఆశతో, ప్రజా సంక్షేమాన్ని కూడా మరచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సమగ్ర కుటుంబ సర్వే సమాచారం అనేది ఒక ఎక్స్ రే లాంటిదని, ఒక రోగి యొక్క శరీర స్థితి తెలుసుకొనేందుకు ఎక్స్ రే ఏవిధంగా దోహదపడుతుందో, అలాగే తాము చేస్తున్న సర్వే కూడా రాష్ట్ర ప్రజల అన్ని స్థితగతులు తెలుపుతుందన్నారు. అప్పుడే ఎవరికి తాము ప్రభుత్వం తరపున అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నది తేలుతుందన్నారు. రాజ్యాంగం పొందుపరిచిన సామాజిక న్యాయం జరిగేందుకు సమగ్ర సర్వే అవసరమని భట్టి అన్నారు.
ఇక హరీష్ రావు చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ.. అసలు బీఆర్ఎస్ చేసిన సర్వే ఎందుకు చేశారో తెలియదు. అసలు అందులో ఏముందో కూడా తెలియదు. పదేళ్లలో ప్రజల జీవనం మార్పు వస్తుందా.. రాదా.. అందుకే తమ సర్వేనన్నారు. బీఆర్ఎస్ చేసిన సర్వేకు తమ సర్వేకు చాలా వ్యత్యాసం ఉందని, వారు బహిరంగ పరచకుండా రహస్యంగా ఉంచారని, తాము అలా చేయమని, సర్వే పూర్తి కాగానే వివరాలు తప్పక తెలియజేస్తామన్నారు. కేటీఆర్, హరీష్ పదేళ్లు బంగారు తెలంగాణ చేస్తామన్నారని, బంగారు తెలంగాణ పక్కన పెడితే 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని విమర్శించారు. ఇప్పుడు వారు ఏం మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని అభిప్రాయ పడ్డారు.