Telangana: బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒవైసీకి భయపడుతున్నదని చెప్పారు. ఎమ్మెల్సీగా అమీర్ అలీ ఖాన్‌కు రేవంత్ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, ఆయనను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీకి కోపం వస్తుందనే కారణంతోనే అమీర్ అలీ ఖాన్‌కు మంత్రి పదవి ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాగే.. ఎంఐఎం పార్టీకి భయపడే రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడం లేదన్నారు.
రాష్ట్రంలో వరదలపై మాట్లాడుతూ.. రెండు కేంద్ర బృందాలు రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయని, ఈ సర్వేలు వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తాయని బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వివరించారు. వరదల్లో నష్టపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఎందుకు అని ఏలేటి ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జిల్లాలను కలిపారని, ఆ రెండు రాష్ట్రాల్లోని జిల్లాలు విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయని వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా ఆ జిల్లాలు విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయని తెలిపారు.
Also Read: Rain Alert For Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
మరి.. తెలంగాణలో కూడా విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారని ఏలేటి అడిగారు. ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహించడం లేదన్నారు. అసలు సెప్టెంబర్ 17 పై కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. విమోచనం కాకుండా.. విలీనం అంటే మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టే అవుతుందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక చిహ్నాన్ని ప్రకటించలేదు. కానీ, కొన్ని చోట్ల కొత్త తెలంగాణ ఎంబ్లమ్స్‌తో పోస్టర్లు పెట్టారని ఏలేటి తెలిపారు. ఆ ఎంబ్లమ్‌లో కాకతీయ కళాతోరణం లేదని వివరించారు. అయితే.. ఈ ఎంబ్లమ్ గురించి తనకు తెలియదని, అసలు దీన్ని ఎప్పుడు ఆవిష్కరించారు? అని ప్రశ్నించారు. దీన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని అడిగారు.