
Congress Party vs BJP Party(Telangana news today) :
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ బలప్రదర్శనకు సిద్ధం కావడం ఆసక్తిని రేపుతోంది. ఒకేరోజు రెండు పార్టీలు నగరంలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ , ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించింది. మేనిఫెస్టోలోని హామీలపైనా క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరో 3నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో హస్తం పార్టీ ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది.
సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. తుక్కుగూడలో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని టీకాంగ్రెస్ నేతలు సంకల్పించారు. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ , ప్రియాంక హాజరు కానున్నారు.
మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ పూర్తిగా డీలా పడింది. ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించినా ఆ పార్టీలో జోష్ రాలేదు. ఈ సభకు అమిత్ షా హాజరై రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేసినా కాషాయ శ్రేణుల్లో మాత్రం ఆ నమ్మకం కలిగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సభకు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాలంపై పార్టీ నేతలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ రోజు ఉదయం జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం జరిగే సభకు హాజరుకావాలని నిర్దేశించారు. అలాగే తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన చేయాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. జిల్లాల అధ్యక్షులను మార్చాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లను మార్చాలని నిర్ణయించారు. యాక్టివ్‌గా లేనివారిని తప్పిస్తారని తెలుస్తోంది.