Local Body Elections: ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ అస్థిత్వ పోరాటం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగిపోయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పార్టీ పేరులోంచి తెలంగాణ పేరును తీసేసిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదుర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్సే గల్లంతైంది. దాంతో కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవ్వడంతో, కేటీఆర్ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు చావో, రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఫ్యూచర్లో పార్టీని గద్దెనెక్కించడం ఏమో కాని.. ముందు కనీసం తన జిల్లాలో, తన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవడం చిన్నబాస్‌కు సవాల్‌గా మారిందట.
స్థానిక సమరాన్ని సవాల్‌గా తీసుకున్న బీజేపీ, బీఆర్ఎస్
స్థానిక సమరాన్ని బీజేపీ, బీఆర్ఎస్ ఈసారి సవాల్ గా తీసుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ హడావిడి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పూర్తి ఎపిసోడ్ అధికారపార్టీగా తమకు కలిసివస్తుందనే భావన కాంగ్రెస్ లో కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పావులు కూడా కదుపుతోంది. ఇదిలా ఉంటే.. బీజేపీ ఈసారి గట్టిగా బలపడి.. క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెట్టాలని చూస్తుంటే.. రాబోయే స్థానిక సమరం ప్రాంతీయపార్టీగా బీఆర్ఎస్‌కు ఒకవిధంగా అస్తిత్వ పోరాటమనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు రేసులో ఉన్న బీజేపీకి గట్టి పోటీనివ్వగలమా అన్న సందేహం బీఆర్ఎస్ లో నెలకొంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక్కమాటలో చెప్పాలంటే యాక్టింగ్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్న కేటీఆర్‌కు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెద్ద సవాలే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సిరిసిల్లలో అత్యధిక స్థానాలపై కేటీఆర్ ఫోకస్
కేటీఆర్‌కు మెజార్టీ స్థానిక సంస్థల్లో సీట్లను గెలిపించుకుని రాష్ట్రస్థాయిలో పార్టీని నిలబెట్టడమెంత ముఖ్యమో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందులోనూ తన నియోజకవర్గమైన సిరిసిల్లలో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడం అంతకన్నా ముఖ్యం. కేసీఆర్ ఇఫ్పటికే తన వారసుడు కేటీఆర్ అని చెప్పకనే చెప్తున్నారు. అయినా లోలోపల అంతర్గతంగా వారసత్వం కోసం జరుగుతున్న పంచాయితీలు.. పార్టీ పగ్గాల రేసులో ఫోకస్ అవుతున్న కవిత, హరీష్‌రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ వంటి వారు ఫోకస్ అవుతున్నారు. ఆ క్రమంలో తనను తాను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం కేటీఆర్ భుజస్కంధాలపై పడింది.
స్థానిక సమరంలో సహజంగా అధికార పార్టీ వైపే మొగ్గు
ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో సహజంగానే స్థానిక సమరంలో అధికారపార్టీకే మొగ్గు ఉంటుంది. అదే సమయంలో నిధులన్నీ కేంద్రంలోని బీజేపీనే ఇస్తోంది.. రాబోయేది కూడా రాష్ట్రంలో బీజేపీనేనంటూ కమలం పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ సమయంలో రెండు జాతీయపార్టీలను తట్టుకుని నిలబడి.. ఓ ప్రాంతీయ పార్టీ ఎంతవరకూ నిలబడుతుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న..? బీఆర్ఎస్ రథసారథిగా రాష్ట్రంలో అధిక స్థానాలను కైవసం చేసుకోవడం మాట కాస్సేపు పక్కనబెడితే… తన జిల్లాలో, ముఖ్యంగా నియోజకవర్గంలోనే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ భవితేంటో తెలియని ఒక అయోమయాన్ని కేటీఆర్ ఎదుర్కొంటున్నారంట.
సిరిసిల్లపై ఎక్కువ ఫోకస్ పెడుతున్న కేటీఆర్
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు పక్కనబెడితే.. కనీసం తన నియోజకవర్గంలోనైనా పరువు నిలబెట్టుకునే స్థాయిలో స్థానాలు సంపాదించుకోకుంటే.. కేటీఆర్‌కు అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. కాబట్టి, ఆ ఆందోళనతోనే మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర స్థాయి స్థానిక సమరంపై ఎంత ఫోకస్ చేస్తున్నారో.. అంతకు రెట్టింపు ఫోకస్ ను సిరిసిల్లపై పెట్టారంట. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన మండలాలవారీగా.. పక్క నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమరంలో వచ్చే స్థానాలను బట్టి భవిష్యత్తు రాజకీయాల్లో ఏ పార్టీల హవా ఎంత ఉంటుందనే ఒక అంచనాకు సహజంగానే వచ్చే అవకాశాలుంటాయి.. ఆ క్రమంలో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనీసం సిరిసిల్ల జిల్లాలో, నియోజకవర్గంలోనైనా గురి తప్పకుండా బాణాన్ని సంధించాలన్నా తారకరాముడికి అపసోపాలు తప్పడం లేదంట.. ఇప్పటికే ఆసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్‌కు ముందు నుంచి మంచి పట్టున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పధ్నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది..
మండలాల వారీగా సమీక్షల నిర్వహిస్తున్న కేటీఆర్
పార్లమెంటు ఎన్నికల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి.. సిరిసిల్ల లో ఎప్పుడూ కేటీఅర్ వెంబడి ఉండే నాయకులపై భూఅక్రమణ కేసులు నమోదు అయ్యాయి.. సిరిసిల్ల నియోజకవర్గం లొని దాదాపుగా అన్ని మండలాలలోని కేటీఆర్ వర్గీయలపై కేసులు నమోదు అవ్వడం జైలుకు కూడా వెళ్ళిరావడం జరిగిపోయాయి.. అయితే ఇన్ని రోజులు పెద్దగా నియోజకవర్గం లో పర్యటించని కేటిఅర్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న నేఫధ్యంలో ఇప్పుడు మండలాల వారీగా వరసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: కొడుకు ఫ్యూచర్ కోసం నలిగిపోతున్న నల్లపరెడ్డి!
బీఆర్ఎస్ చిన్న బాస్ విపక్షాల సవాళ్ళను ఎదుర్కోగలరా?
ఇప్పటికే చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు తయారైన బీఅర్ఎస్ క్యాడర్‌కు జవసత్వాలు నూరిపోసే ప్రయత్నం చేస్తూ.. నేనున్నంటూ భరోసా నిస్తూ మీటింగ్ లలో ఉత్సహం,ఉత్తేజం తీసుకురావడానికి పాటు పడుతున్నారు. మరోవైపు అధికారం లో ఉన్న కాంగ్రెస్ సిరిసిల్ల లో స్థానిక సంస్థ ల ఎన్నికలలో జెండా ఎగురవేసి కేటీఆర్ అధిపత్యానికి గండికొట్టేందుకు సిద్ధం అవుతుండగా కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈసారి ఎలాగైనా స్థానిక సంస్థల లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని క్యాడర్, లీడర్లలతో వరుస సమావేశాలు పెట్టి తగ్గేదిలేదని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తన వ్యూహాలతో కేటీఆర్ ప్రాబల్యానికి పూర్తిగా చెక్ పెట్టాలని చూస్తోంది. మరిలాంటి పరిస్ధితుల్లో బీఆర్ఎస్ చిన్న బాస్ విపక్షాల సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది చర్చనీయాంశంగా మారింది.
Story By Rami Reddy, Bigtv