Bapu Rao Joins Congress Party: తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ సోయం బాపురావు గురువారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు మహేష్ గౌడ్. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
ఆదిలాబాద్ కు చెందిన మాజీ ఎంపీ సోయం బాపూరావు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ.. తాను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పై ఉన్న నమ్మకంతో తన పార్టీలో చేరినట్లు, ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అద్భుత పాలన అందించారన్నారు. అన్ని మతాలు తనకు సమానమని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఆవేశపూరితంగా చేసినవిగా భావించాలని బాపురావు కోరారు. నేటి నుండి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ల చేరికపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తున్నారన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, జాబ్ నోటిఫికేషనన్స్, గృహజ్యోతి, రుణమాఫీ, ఇలా ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కొత్తగా అర్హులకు గృహాలు మంజూరు చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని, బీఆర్ఎస్ పార్టీ గతంలో తమ పార్టీ నేతలను బెదిరింపులకు గురిచేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు.
కాగా త్వరలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మేల్యేల చేరికలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి. అసలే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ సాగుతుండగా మహేష్ గౌడ్ చెప్పినట్లుగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగుతుందన్నది పొలిటికల్ టాక్. ఇంతకు ఆ ఎమ్మేల్యేలు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.