BigTV English

BJP: రథయాత్రతో రేవంత్ పాదయాత్రకు కౌంటర్?.. బీజేపీ గేమ్ ఛేంజ్!

BJP: రథయాత్రతో రేవంత్ పాదయాత్రకు కౌంటర్?.. బీజేపీ గేమ్ ఛేంజ్!

BJP: రథయాత్ర. ఈ పేరు వింటేనే కమలనాథుల్లో కదనోత్సాహం. అప్పట్లో ఎల్‌కే అడ్వానీ గుజరాత్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టి.. రెండుసీట్ల బీజేపీని.. దేశాన్ని ఏలే స్థాయికి తీసుకొచ్చారు. అదే స్పూర్తితో తెలంగాణలోనూ రథయాత్రకు సిద్ధమవుతోంది కమలం పార్టీ.


ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటికే ఐదు దఫాలుగా పాదయాత్ర చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజల నుంచి స్పందన బానే వచ్చింది. ఎందుకోగానీ ఆరో విడత పాదయాత్రకు బాగా గ్యాప్ వచ్చింది. ఈలోగా స్టేట్ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో అంటూ పాదయాత్రతో తెలంగాణ జిల్లాలను చుట్టేస్తున్నారు. రేవంత్ యాత్రకు భారీ ప్రజాదరణ వస్తోంది. పంచ్ డైలాగులు, మాటల తూటాలతో.. రేవంత్ పాదయాత్రకు మంచి కవరేజ్ వస్తోంది.

రేవంత్ దూకుడు చూసి బీజేపీ కంగుతిన్నట్టు ఉంది. వెంటనే తాము యాక్టివ్ కాకపోతే కొంపలు మునిగిపోతాయని పసిగట్టినట్టుంది. అందుకే, గేమ్ ప్లాన్‌ను మార్చేసింది. ప్రజా సంగ్రామ యాత్రల స్థానంలో రథయాత్ర చేయాలని డిసైడ్ చేసింది.


సమయం లేదు మిత్రమా అంటోంది కమలదళం. పాదయాత్రలతో నడుచుకుంటూ ప్రజల్లోకి వెళ్లేంత గడువు లేదంటూ.. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో.. రథయాత్రలకు శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ పార్టీ మాదిరే ప్రముఖ నేతలంతా రథయాత్ర చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు రథాలను రెడీ చేయిస్తున్నారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రథయాత్రలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజవర్గంలో ఒక్కో రోజు యాత్ర చేపట్టేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తోంది. ఒక్క పార్లమెంట్‌ ఏరియాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్‌ రథయాత్రల్లో పాల్గొని.. ప్రసంగించేలా వ్యూహం రచించింది. ఇదంతా రేవంత్‌రెడ్డి పాదయాత్ర ఎఫెక్టే అంటున్నారు.

ఈ రథయాత్రల ఐడియా బీజేపీ అగ్రనేత అమిత్‌షా దేనట. ఇటీవల రాష్ట్ర పార్టీ ప్రముఖులను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వారికి పార్టీ యాక్షన్ ప్లాన్‌పై దిశానిర్దేశం చేశారు. కర్నాటకలో ఎన్నికలు కంప్లీట్ కాగానే.. ఇక ఫుల్ టైమ్ తెలంగాణపైనే తాను ఫోకస్ చేస్తానని ధీమా కలిగించారు. కాస్త గట్టిగా కొట్లాడితే.. తెలంగాణలో ఈజీగా అధికారంలోకి వచ్చేయొచ్చనేది బీజేపీ అంచనా. అందుకే, ప్రచార వ్యూహాలతో పాటు పార్టీ అంతర్గత సమస్యలపైనా దృష్టి పెట్టారు అమిత్‌షా. నేతల మధ్య మరింత సమన్వయం కుదిరేలా.. ప్రతీరోజూ ఒక నేత ఇంట్లో సమావేశం కావాలని ఆదేశించారు. పార్టీలో చేరికలను సమన్వయం చేసుకునే బాధ్యతలను బన్సల్‌కు అప్పగించారు.

ఇలా అంతర్గత వ్యూహాలతో పాటు రథయాత్రలతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలనేది బీజేపీ గేమ్ ప్లాన్. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ యాక్టివ్ కావడంతో.. కమలం స్పీడును మరింత పెంచేలా.. పాదయాత్ర స్థానంలో రథయాత్రలను రెడీ చేస్తున్నారు. రథసారధి మాత్రం బండి సంజయే. వ్యూహ సారధి అమిత్‌షా.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×