Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ-జనసేన మైత్రి మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. కేవలం మద్దతు కోరడమే కాకుండా, పవన్ కల్యాణ్‌ను స్వయంగా రంగంలోకి దింపుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సొంత పార్టీ కేడర్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ కురుక్షేత్రంలో గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో బలం లేకే పొరుగు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పంచన చేరుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పవన్‌తో ప్రచారం గెలుపు కోసమా లేక పార్టీ ఉనికిని కాపాడుకోవడంలో భాగమా? అనే విమర్శలు వస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాషాయ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వనుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని ఆయన నివాసంలో స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కలిసి మద్దతు కోరారు. కాగా దీనికి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేవలం మద్దతుకే పరిమితం కాకుండా, పార్టీ అభ్యర్థుల తరపున తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీయే కూటమిలో జనసేన ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ మద్దతు కోరినట్లు శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు వస్తుండటం గమనార్హం. కాషాయ పార్టీకి చెందిన ఓ వర్గం నేతలే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జనసేన మద్దతు కోరవడంతో బీజేపీ బలహీనత మరోసారి బట్టబయలైనట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సొంత బలంపై నమ్మకం లేకనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆశ్రయించారన్న చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు పొత్తుల్లేవు, సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పిన రాష్ట్ర నాయకత్వం చివరకు ప్లేట్ ఫిరాయించిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో ఉనికిలో లేని ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుందని పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో కేడర్ లేకనే ప్రచారానికి జనసేన అధినేతను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఉనికిలో లేని పార్టీల మద్దతు కోసం రాష్ట్ర బీజేపీ నేతలకు అంత తాపత్రయం ఎందుకన్న విమర్శలు వస్తున్నాయి.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. తెర వెనుక కొత్త కోణం
గతంలో జనసేనను దూరం పెట్టిన కాషాయ నేతలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో పవన్ చెంతకు చేరారని ప్రత్యర్థి పార్టీలు సైతం ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఆయన పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, అలాంటి వ్యక్తిని స్వయంగా కేంద్ర మంత్రి వెళ్లి భిక్షాందేహి అని వేడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆంధ్రా డిప్యూటీ సీఎంకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఆయన దిష్టి కల్యాణ్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకప్పుడు ఆంధ్రా పార్టీ అంటూ విమర్శించిన వారే, ఇప్పుడు అదే పార్టీ నేతను స్టార్ క్యాంపెయినర్ గా ఆహ్వానించడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈనెల 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. జనసేన, బీజేపీ ఇరు పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, స్నేహపూర్వక వాతావరణంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే దిశగా అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు జనసేన పేర్కొంది. ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలో పార్టీ ప్రకటించనుంది. సొంత బలంపై నమ్మకం లేకనే బీజేపీ పవన్ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న ఆరోపణలు వస్తుండగా పవన్ పర్యటన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది చూడాలి. ఇది కమలదళానికి బూస్ట్ ఇస్తుందా లేక మరిన్ని విభేదాలకు దారితీస్తుందా అనేది చూడాలి.
Alson Read: Cochin Shipyard: పదో తరగతి అర్హతతో 260 ఉద్యోగాలు.. నెలకు రూ.23,000 జీతం, ఇంకా 2 రోజులే భయ్యా..