Raja Singh: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. సొంత పార్టీ నేతలపైనా ముక్కుసాటి మాట్లాడే మనస్తత్వం ఆయనది. ఒక్కోసారి విరుచుకుపడిన, పడుతున్న సందర్భాలు లేకపోలేదు. సొంత పార్టీ నేతలను ఇరుకున పెడుతూ ఓ లేఖ విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు ఆ పార్టీలో దుమారం రేపుతోంది. అసలేం జరిగింది?
కొన్నాళ్లుగా పార్టీలో నేతల వ్యవహారశైలిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనను వెళ్లిపోమంటే బయటకు వెళ్లిపోతానని ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చేశారాయన. బుధవారం నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు.
పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లేఖను విడుదల చేశారు. తెలంగాణలో కొందరు ప్రభుత్వం పెద్దలతో సీక్రెట్‌గా సమావేశం అవుతున్నారని ఆరోపించారు. ఈ తరహా సమావేశం పెట్టుకుంటే పార్టీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు గమనించాలన్నారు.
తెలంగాణ హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాన్లు పార్టీ నుంచి బయటికి వెళ్లి పోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో మార్పులు జరగాలని కుండబద్దలు కొట్టేశారు రాజాసింగ్. ఇలాంటి వాటిని హైకమాండ్ గమనించాలని అభిప్రాయపడ్డారు.
ALSO READ: జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలపై సభలో కలకలం
ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేవాళ్లు చాలామంది ఉన్నారన్నారు. అలాంటి వాళ్లను రిటైర్ చేస్తేనే(దూరం పెడితే) పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు. ఇది కేవలం తనొక్కడి అభిప్రాయం కాదన్నారు. చాలామంది బీజేపీ సీనియర్లు, కార్యకర్తల మనసులో మాటను బయటపెట్టానన్నారు. కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నవారి వివరాలు తనకు తెలుసని, త్వరలో జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు రాజాసింగ్.
ఇలాంటి నేతల వల్లే హోలీపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. హోలీ ప్రతీ ఏట్లా జరుపుకోవాలని పోలీసులు చెబుతారా అని ప్రశ్నించారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్ పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే రాజాసింగ్.
గతంలో బీజేపీని ఒకే సామాజిక వర్గానికి వ్యక్తులు శాసిస్తున్నారని ఆరోపించారు ఆయన. రాష్ట్ర నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందంటూ బాహాటంగానే వ్యాఖ్యానించారు. దీనిపై జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెల రోజుల రాజాసింగ్ ఓ లేఖ విడుదల చేసిన విషయం తెల్సిందే.