Bandi Sanjay on Allu Arjun : పుష్ప సినిమా ద్వారా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించిన అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. బన్నీ అరెస్ట్ వ్యవహారంపై తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించగా.. ఇప్పుడు కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బన్నీ అరెస్ట్ వ్యవహారాన్ని ఖండించిన ఆయన.. జాతీయ స్థాయి నటుడు అనే గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విధానం సరైనది కాదన్న బండి సంజయ్.. కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే విధానాన్ని అది కాదని అన్నారు. నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమైన చర్య అని, అగౌరవంకరమైన చర్య అని వ్యాఖ్యానించారు.
భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయన స్థాయిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిందని అన్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సికింద్రాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ జన సందోహంలో ఒక్కసారిగా తోపులాట జరగ్గా.. ఓ మహిళ మృతి చెందింది. ఈ విషయమై ఇప్పటికే సినిమా బృందం ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా బృందం తరఫున భారత మహిళ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్రమంత్రి బండి సంజయ్.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో మహిళల దుర్మరణం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే థియేటర్ వద్ద భారీ జన సందోహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు.
రెండు భాగాలుగా వచ్చిన పుష్ప సినిమాలో.. మొదటి భాగం అఖండ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో విడుదలైన రెండో పార్ట్ పై ప్రజలు, సినిమా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా అద్భుతంగా ఉంటుందని, తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారనే ఆనందంలో.. పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు పోటెత్తారు. ఇంతటి భారీ అంచనాలున్న సినిమా కార్యక్రమానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్న బండి సంజయ్..ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని అన్నారు.
Also Read : అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించిన అల్లు అర్జున్, అతని అభిమానులు క్రమశిక్షణ, గౌరవానికి మారుపేరు అని, వారు గందరగోరానికి పాల్పడరని, అలాంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విధానం సరైనది కాదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ స్పందన
తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తప్పు చేస్తే చిన్నవారైనా, పెద్దవారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తాను ఎవరికి మద్దతుగా గాని, వ్యతిరేకంగా కానీ నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం పోలీసులు తమ పని తాము చేసుకునిపోతారని తెల్చి చెప్పేశారు.